Share News

ఏపీ పెట్టుబడులకు గ్లోబల్ వేదిక.. విశాఖ సీఐఐ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:59 PM

విశాఖటలో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌లో చర్చించే అంశాలు, డిక్లరేషన్లపై సీఐఐ ప్రతినిధులు, అధికారులతో సీఎం రివ్యూ చేపట్టారు.

ఏపీ పెట్టుబడులకు గ్లోబల్ వేదిక.. విశాఖ సీఐఐ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్
CII Partnership Summit 2026

అమరావతి, నవంబర్ 7: విశాఖటలో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌లో చర్చించే అంశాలు, డిక్లరేషన్లపై సీఐఐ ప్రతినిధులు, అధికారులతో సీఎం రివ్యూ చేపట్టారు. విశాఖ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విశ్వవ్యాప్తం చేయాలన్నారు. విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలను అనుసంధానిస్తూ... చర్చలను వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాల దిశగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రపంచ మార్కెట్లతో రాష్ట్ర పరిశ్రమలను అనుసంధానించడం, ఎంఎస్‌ఎంఈలకు కొత్త వ్యాపార పరిచయాలు కల్పించడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు.


సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ అవకాశాలను పరిచయం చేయడం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం పెంచేలా సదస్సు నిర్వహించాలని సీఎం వెల్లడించారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీల చెల్లింపు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలు ప్రపంచ వ్యాప్తం కావాలన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, సెమికండక్టర్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అత్యుత్తమ పాలసీలు, సమర్థులైన నిపుణులు, మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్, బలమైన నాయకత్వం వంటి అనుకూలతలు ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడి సురక్షితం, సులభతరం అనే విషయం పారిశ్రామికవేత్తలకు తెలియాలన్నారు. ఈ సమీక్షకు ప్రభుత్వ అధికారులు, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ఇతర సీఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.


ప్రపంచ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి విశాఖ సదస్సు తీసుకురానుంది. ఈ సదస్సుకు 40 మందికి పైగా అంతర్జాతీయ వక్తల భాగస్వామ్యం ఉండనుంది. అలాగే 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది భారతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తంగా సుమారు 1,250 మంది దేశ, విదేశీ ప్రతినిధుల భాగస్వామ్యంతో సదస్సు జరగనుంది. వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించేందుకు 400 బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ టు బీ) సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపులకు బిజినెస్‌ టు గవర్నమెంట్‌ (బీ టు జీ) సమావేశాలు నిర్వహించనున్నారు. సింగపూర్‌ నేపాల్‌, కంబోడియా, మయన్మార్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కెనడా, స్లోవాక్‌ రిపబ్లిక్‌, మారిషస్‌, మొజాంబిక్‌, ఈజిప్ట్‌, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా వంటి పలు దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకానున్నారు.


రెండు రోజులపాటు జరగనున్న సదస్సుకు వివిధ దేశాల రాయబారులు, ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. రెండు రోజుల సదస్సులో 6 అంశాలపై ప్రధాన చర్చలు జరగనున్నాయి.

చర్చించే అంశాలివే..

  • వాణిజ్యం - పెట్టుబడులు - గ్లోబల్ వాల్యూ చైన్స్

  • ట్రస్ట్ - జియో ఎకనమిక్స్ - గ్లోబల్ కో ఆపరేషన్

  • వ్యవసాయం - ఆహార భద్రత - జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థ

  • ప్రతిభ - నైపుణ్యాలు - అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు

  • సాంకేతికత - ఆవిష్కరణలు - భవిష్యత్‌ పరిశ్రమలు

  • స్వచ్ఛ ఇంధనం- సుస్థిర వృద్ధి అనే ఆరు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్

జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:07 PM