‘పోలవరానికి నిధుల కొరత రాకుండా చూడండి’.. కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:51 AM
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు.
ఢిల్లీ, అక్టోబర్ 8: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. అందులో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను చంద్రబాబు కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పోలవరం పనుల ప్రగతిని, అలాగే ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు.
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కరించాలని కోరారు. ఆ రెండు రాష్ట్రాల్లో పోలవరం నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్స్ పనులకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందనే కారణంతో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం అబేయన్స్‌లో ఉన్నప్పటికీ... దాన్ని శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఒప్పించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
మూడు రాష్ట్రాల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పరస్పర సహకారం, సమన్వయం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో... నిర్వాసితుల సమస్యల పరిష్కారం.. పునరావాస పనులకూ అంతే ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పోలవరానికి ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు.

అలాగే పోలవరం వద్ద 45.72 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. చేపట్టాల్సిన పనులపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు చర్చించారు. గోదావరి నది నుంచి వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయని.. ఆ నీటిని సద్వినియోగం చేసుకునేలా పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టును పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇటీవలే ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనులను ప్రారంభించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 95 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉంటే... వాటిలో 62 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయన్నారు. తాజాగా 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించేలా పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, పనులకు అనుగుణంగా సత్వరం నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను కూడా కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. నిందితుడి అరెస్ట్
నానా పటేకర్ మరణవార్త తెలిసి చింతిస్తున్నా: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News