Share News

గొడ్డలి పార్టీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 08 , 2026 | 04:39 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జిలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

గొడ్డలి పార్టీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, ఆగస్టు 8: టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జిలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వం పెంపొందించడానికే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని.. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోకుంటే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుందన్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని... గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నిర్దేశించారు.


డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని.. దానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగామని సీఎం వెల్లడించారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చక్కగా చెప్పగలిగామన్నారు. కాబట్టే... గొడ్డలి పార్టీ మినహా కొన్ని పార్టీలకు చెందిన నేతలు ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు. డీఎస్సీ ద్వారా రిక్రూటైన టీచర్లే ఇవాళ(శనివారం) గొడ్డలి పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టారన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించగలిగితే... గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని చెప్పారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనే దానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమన్నారు.


పారదర్శకంగా వ్యవహరించి.. వాస్తవాలు చెబితే ప్రజలే కుట్రలను చేధిస్తారనడానికి కర్నూలులో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్ల ఆందోళనే ఉదాహరణ అని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా... వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సాధారణ కార్యకర్తకైనా, పార్టీ అగ్రనాయకుడికైనా పార్టీనే సుప్రీం అని అన్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఏమేం జరుగుతున్నాయనే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని తెలిపారు. కార్యకర్తలను పట్టించుకోని వారిని.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో జీరో టాలరెన్స్ అని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఏ ఎన్నికలు జరిగినా... ప్రతి బూత్‌లోనూ గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే రావాలని సూచించారు. ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి, నాయకుడి ప్రవర్తన ఓట్లపై చాలా ప్రభావం చూపుతుందన్నారు. యూనిట్, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, మండల అధ్యక్షులకు గౌరవం దక్కేలా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలనే బలితీసుకుంటున్నారు.. జగన్‌పై మంత్రి సవిత ఫైర్

శత్రువుల కోసం పదడుగులు ముందే ఉంటా: బుద్దా వెంకన్న

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 04:46 PM