ఏపీలో పెట్టుబడులే లక్ష్యం.. ఎంఓయూలను సాకారం చేస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 08 , 2026 | 02:35 PM
ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఢిల్లీ, అక్టోబర్ 8: ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఎంఓయూలను సాకారం చేసే అంశంపై ఎక్కువ దృష్టిసారించామని పారిశ్రామికవేత్తలకు వెల్లడించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను త్వరలో ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. బిల్డ్ ఏపీ నినాదంతో పని చేస్తున్నామని ప్రకటించారు.
ప్రధాని పాత్ర అత్యద్భుతం..
25 ఏళ్లుగా నిరంతరాయ ప్రజాసేవలో ఉన్న ప్రధాని మోదీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ ఇన్‌ఫ్రాను దేశంలో తీసుకురావటంలో ప్రధాని మోదీది కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. అత్యద్భుతమైన రోడ్ నెట్‌వర్క్ కలిగిన భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. రైల్వే నెట్‌వర్క్‌లోనూ దేశం కీలక స్థానంలో ఉందని తెలిపారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే, రోడ్ నెట్‌వర్క్ కలిగి ఉన్న బలమైన దేశాన్ని ప్రధాని తీర్చిదిద్దుతున్నారని వివరించారు. రక్షణ పరంగా అత్యంత భద్రత కలిగిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని పాత్ర అత్యద్భుతమని కొనియాడారు.
బిల్డ్ ఏపీ నినాదంతో..
టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కీలకంగా ఉన్న భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఏపీకి చేయూత ఇవ్వటంలో కేంద్రం, ప్రధాని మోదీ ముందున్నారని అన్నారు. పోలవరం, అమరావతి రాజధాని ప్రాజెక్టులతో పాటు వేర్వేరు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారని చెప్పారు. విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. బిల్డ్ ఏపీ అనే నినాదంతో పని చేస్తున్నామని చెప్పారు. ఏపీలో సంపద సృష్టించటంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. గతేడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని.. గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని అన్నారు. ఎంఓయూలకు మాత్రమే పరిమితం కావటం లేదని.. వాటిని పెట్టుబడులుగా మలిచేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
నదుల అనుసంధానంతో నీటి కొరతే రాదు..
గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ లాంటి ప్రముఖ కంపెనీలు ఏపీకి వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. గతేడాది ప్రకటించిన మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను నవంబరు 12,13 తేదీల్లో ప్రారంభిస్తామని తెలిపారు. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా యాక్టును రద్దు చేసేశామని చెప్పారు. గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, కావేరి నదులు కలిస్తే ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి కొరతే రాదని వెల్లడించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేయాలని నిర్దేశించుకున్నామని... సౌత్ ఈస్ట్ ఏషియాకు గేట్ వేగా ఏపీని మార్చటమే లక్ష్యమని స్పష్టం చేశారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు మజగావ్ డాగ్ యార్డ్ లిమిటెడ్ ముందుకు వచ్చిందన్నారు. మచిలీపట్నంలో గోవా షిప్ యార్డు సంస్థ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందన్నారు. డ్రోన్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను కూడా తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో ఏర్పాటు చేశామని తెలిపారు.
వాటిని అమలు చేసేందుకు ఏపీ సిద్ధం..
5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టును కూడా రక్షణశాఖ రాయలసీమలో ప్రారంభించిందని చంద్రబాబు తెలిపారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై ఒప్పందాలు కుదిరాయని, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్ మిషన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రగతిలో ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణం అమలు చేయడానికి ఏపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐ సహా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలుగా తయారు చేసేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను స్వయం బ్రాండ్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లకు ప్రమోట్ చేస్తామన్నారు. డేటా లేక్ లాంటి వ్యవస్థల ద్వారా ఏఐ స్టాక్ లాంటి సాంకేతికతో వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని తెలిపారు. జీఎస్టీ పన్నుల వసూళ్లలో ఏఐ స్టాక్ అమలు చేయటం ద్వారా రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.
బ్లూ ఎకానమీలో ఏపీ కీలకం..
వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో ఉన్న అపారమై అవకాశాలను అందిపుచ్చుకునేలా స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. బ్లూ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలవుతాయన్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ద్వారా వివిధ రంగాల్లో నాయకత్వాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విశాఖ లాంటి డెస్టినేషన్లకు చేరుకునేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందన్నారు. బాపట్ల లాంటి అద్భుతమైన తీర ప్రాంతాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుల నిర్వహణ కోసం కేంద్రం అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలివే
నెల్లూరులో 15 ప్రభుత్వ హైస్కూళ్ల ఆధునికీకరణ: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News