డప్పు కళాకారుల ప్రదర్శన.. సరికొత్త చరిత్రకు నాంది: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - May 16 , 2026 | 11:12 AM
దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేశ్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విజయవాడ, మే 16: దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు(మే 17) సాయంత్రం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. డప్పు ద్వారా ఆధ్యాత్మిక, సంగీత, ప్రచార కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డప్పు వాయిద్యానికే జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని గుర్తుచేశారు. మేల్కొలిపే ఈ డప్పును ఓ దళితుడు మోగిస్తారని.. ఆ తరువాత ఇతర వాయిద్యాలు ప్రారంభమవుతాయని చెప్పారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేశ్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి బతుకుల్లో వెలుగులు ఇచ్చేలా వారి సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు.
భారత రాజ్యాంగం ద్వారా అందరకీ సమాన ప్రాధాన్యం ఇచ్చిన అంబేద్కర్ నడయాడిన ప్రాంతాలను ప్రధాని మోదీ అభివృద్ధి చేశారని మాధవ్ చెప్పారు. విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేశారని అందరూ అనుకుంటారని.. అది నిజం కాదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించి నిర్మాణం చేసిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి వెళ్లేలా రేపు(ఆదివారం) డప్పు కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. ‘చదవండి.. సమీకరించండి.. పోరాడండి అని అంబేద్కర్ చెప్పారు. చదువు ద్వారా సమాజంలో గుర్తింపు ఉంటుందని చెప్పారు’ అని గుర్తుచేశారు.
రేపు పెద్ద ఎత్తున జరిగే ఈ ప్రదర్శనలో మంత్రి సత్యకుమార్, కూటమి నాయకులు పాల్గొంటారని మాధవ్ తెలిపారు. డప్పు కళాకారులకు చేయూతనివ్వాలని.. ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అన్ని కులాల వారికి ఆలయాల్లో సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేవాలయ వ్యవస్థలో అన్నివర్గాల వారి పాత్ర ఉంటుందని తెలిపారు. డప్పు కళాకారులు ప్రతి ఉత్సవంలో కీలకంగా పని చేస్తారన్నారు. రేపు జరిగే భారీ ప్రదర్శన సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బాధగా ఉంది.. కానీ తప్పనిసరి పరిస్థితి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
పొదుపు చర్యలు.. బ్యాటరీ సైకిల్‌పై కలెక్టర్ లక్ష్మీశా
Read Latest AP News And Telugu News