పొదుపు చర్యలు.. బ్యాటరీ సైకిల్‌పై కలెక్టర్ లక్ష్మీశా
ABN , Publish Date - May 16 , 2026 | 10:40 AM
ఇంధన పొదుపు చర్యల్లో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. బ్యాటరీ బైక్‌లే కాదు.. బ్యాటరీ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
విజయవాడ, మే 16: ఇంధన పొదుపు చర్యలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పక్కాగా అమలు చేస్తున్నారు. ఈరోజు(శనివారం) తన కార్యాలయానికి బ్యాటరీ సైకిల్‌పై వచ్చారు. జిల్లా పర్యటనకు ఒకే బ్యాటరీ కారులో సిబ్బందితో కలిసి వెళ్లేందుకు కలెక్టర్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీశా మాట్లాడుతూ... ఇంధన పొదుపు చర్యల్లో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బ్యాటరీ బైక్ లే కాదు.. బ్యాటరీ సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు ధరలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ- బైక్‌లో వెళ్లినట్టే.. ప్రాపర్‌గా స్పీడ్‌గా వెళ్లొచ్చని అన్నారు. దాదాపు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల రేంజ్ ఉందని వెల్లడించారు.
పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల ఖర్చు, కాలుష్యం పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి శుక్రవారం ఈ బైక్‌లో, ఎలక్ట్రానిక్ సైకిల్‌నే ప్రభుత్వ యంత్రాంగం వినియోగించాలని సూచించారు. ‘ప్రజలకు కూడా నా విన్నపం ఏంటంటే... చాలా మంచి పర్యావరణ హితకరమైన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దయచేసి బ్యాటరీ వాహనాలు వాడటం అలవాటు చేసుకోండి. పర్యావరణం కాపాడడంతో పాటు మీ డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరాన్ని ఈ విషయంలో ముందంజలో నిలపాలని అందరినీ కోరుకుంటున్నా’ అని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందరూ కూడా కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించేశారని తెలిపారు. అదే బాటలో తాము కూడా ఒకే బ్యాటరీ వాహనాన్ని జిల్లా పర్యటనలకు వినియోగిస్తున్నామని చెప్పారు. అందరూ ఎలక్ట్రానిక్ బండికి షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు.

ఇవి కూడా చదవండి...
పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు
బాధగా ఉంది.. కానీ తప్పనిసరి పరిస్థితి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
Read Latest AP News And Telugu News