ఏపీలో గ్రామాల విలీనం.. స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:47 PM
ఏపీలో కొన్ని గ్రామాలను ఏకపక్షంగా మున్సిపాలిటీల్లో విలీనం చేశారంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
అమరావతి, అక్టోబర్ 14: ఏపీలో కొన్ని గ్రామాలను ఏకపక్షంగా మున్సిపాలిటీల్లో విలీనం చేశారంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మున్సిపాలిటీలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఏపీలోని మున్సిపాలిటీలలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు(బుధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపించారు. ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఈ పిటిషన్లు దాఖలు చేయగా.. వీరి తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై స్టే ఇచ్చేందుకు, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే మున్సిపాలిటీలలో గ్రామాల విలీనం ప్రక్రియ.. తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది పిటిషనర్ల ప్రధాన ఆరోపణ. గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే సమయంలో స్థానిక గ్రామ పంచాయతీల తీర్మానాలు, గ్రామస్థుల ఆమోదం తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు.
చట్టబద్ధమైన ప్రక్రియను నిబంధనలను పాటించకుండా ఏకపక్షంగా జీవోలను జారీ చేశారని సుప్రీంకోర్టును పిటిషనర్లు ఆశ్రయించారు. మున్సిపాలిటీల్లో గ్రామాలు విలీనం కావడం వల్ల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి గ్రామీణ సంక్షేమ పథకాలు కోల్పోవాల్సి వస్తుందని, స్థానిక స్వపరిపాలన హక్కులు దెబ్బతింటాయని పిటిషనర్లు వాదించారు. పట్టణాల విస్తరణ, జనాభా ప్రాతిపదికన అభివృద్ధి పనుల వేగవంతం కోసం చట్టానుసారమే విలీన ప్రక్రియ చేపట్టామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇప్పటికే దీనిపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో మున్సిపాలిటీలలో గ్రామాల విలీనం ప్రక్రియ సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని చెబుతూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఇవి కూడా చదవండి...
వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి
ఏపీ స్థానిక ఎన్నికలు.. సీట్ల సర్దుబాటుపై తుది చర్చల్లో కూటమి నేతలు
Read Latest AP News And Telugu News