తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమికి 74 శాతం ఓట్లు: పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:09 PM
ఏపీలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమికి 74 శాతం ఓట్లతో అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి, నవంబర్ 27: రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమికి 74 శాతం ఓట్లతో అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి కేవలం 26 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని.. గ్రామీణ ఓటర్లలో ఆ పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. బ్యాలెట్, పోస్టల్, ఈవీఎం.. ఏ పద్ధతిలో ఓటేసినా ప్రజల మద్దతు కూటమి వైపే ఉందని మరోసారి రుజువైందని చెప్పుకొచ్చారు.
2021లో వైసీపీ దౌర్జన్యాలు, ఏకగ్రీవాలతో ఎన్నికలు జరిపితే, తాము పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించామని శ్రీనివాసరావు వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నాయకత్వంతో పాటు సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. కుప్పం మండలం వానగుట్టపల్లిలో వైసీపీ నేతల దాడిలో చనిపోయింది టీడీపీ కార్యకర్త రాజేంద్ర అని తెలిపారు. టీడీపీ కార్యకర్త చనిపోతే, వైసీపీ కార్యకర్తపై దాడి జరిగిందంటూ సాక్షి పత్రికలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి సాక్షి వార్తలు రాయడం పత్రికా విలువలకు విరుద్ధమన్నారు. రాబోయే రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మరింత దిగువ స్థాయికి పడిపోవడం ఖాయమని పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారుర.
ఇవి కూడా చదవండి...
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతల స్వీకరణ
ఏపీ పోలీస్ శాఖలో 1,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Read Latest AP News And Telugu News