Share News

‘హిందూ ధర్మ రక్ష’ అంటూ ప్రకటనలు హాస్యాస్పదం.. జగన్‌పై మంత్రి ఫైర్

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:01 PM

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు.

‘హిందూ ధర్మ రక్ష’ అంటూ ప్రకటనలు హాస్యాస్పదం.. జగన్‌పై మంత్రి ఫైర్
Minister Parthasarathi

అమరావతి, మార్చి 20: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి(Minister Parthasarathi) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘హిందూ ధర్మాన్ని భక్షించే వారే ‘హిందూ ధర్మ రక్ష’ అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం’ అని వ్యాఖ్యానించారు. పండుగల సమయంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోకుండా.. కేవలం జగన్ బాగుండాలని మాత్రమే కోరుకోవడమే వైసీపీ నైజమని ఆరోపించారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు లేవని, కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు.


జగన్ ఆలయాలకు వెళ్లకుండా ఇంట్లోనే సెట్టింగ్‌లు వేసి పూజలు చేస్తున్నట్లు నటించడం అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు. అబ్దుల్ కలాం వంటి మహానుభావులు సంప్రదాయాలను గౌరవించి డిక్లరేషన్ ఇచ్చారని.. కానీ జగన్ ఎప్పుడూ ఆ పని చేయలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, యువత ఉపాధి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో గ్రాడ్యుయేట్ నిరుద్యోగం 24 శాతానికి చేరి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.


గత 20 నెలల్లో 6,28,347 ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశంలోనే ఏపీ రికార్డు సృష్టించిందని మంత్రి అన్నారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని చెప్పారు. 2026 ఫిబ్రవరి 28 నుంచి దివ్యాంగులకు సిటీ బస్సులు, పల్లె వెలుగు బస్సుల్లో ఉచితం ప్రయాణం.. ఇతర బస్సుల్లో 50 శాతం రాయితీ అమలు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.


రంజాన్ సందర్భంగా మౌజన్లకు రూ.45 కోట్లు తక్షణమే అకౌంట్లలో విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇప్పటివరకు మూడు విడతలుగా 26,149 మందికి రూ.1,943 కోట్లు చెల్లించామని వివరించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ... అల్లా దయతో అందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు ఎంత కేటాయించారంటే..

మద్యం కుంభకోణం కేసులో అవినాశ్ రెడ్డికి బెయిల్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 04:23 PM