Share News

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తతలు.. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు

ABN , Publish Date - Nov 26 , 2026 | 11:39 AM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి.

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తతలు.. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు
AP Local Body Elections

అమరావతి, నవంబర్ 26: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూతుల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. ఆయా ప్రాంతాల్లో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.


మైలవరంలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం సమీపంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఇదే జిల్లాలోని గుర్రాజుపాలెం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇరుపార్టీల కార్యకర్తల మధ్య బాహాబాహీ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

దొంగ ఓట్లు వేస్తున్నారంటూ..

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని 15వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

బూత్‌ల వద్ద ప్రచారమంటూ ఆరోపణలు

విజయవాడలోని యనమలకుదురులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ బూత్‌ల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను పోలింగ్ కేంద్రాలకు దూరంగా పంపించారు.


నరసరావుపేటలో అల్లర్లకు వైసీపీ కుట్ర

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో అల్లర్లకు వైసీపీ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పిలుపు మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ మహిళలు గుమిగూడారు. కారం పొట్లాలతో సిద్ధంగా ఉండాలని గోపిరెడ్డి పిలుపునిచ్చినట్లు సమాచారం. జొన్నలగడ్డలో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గంటపాటు నిలిచిన పోలింగ్

నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అధికారులు సుమారు గంటపాటు పోలింగ్‌ను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజయేంద్రరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం

కడప జిల్లాలోని పోరుమామిళ్ల మండలం గానుగుపెంట పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.


ప్రకాశం: జిల్లాలోని అయ్యప్పరాజుపాలెం పోలింగ్‌ బూత్‌లో గందరగోళం పరిస్థితి నెలకొంది. బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు మారిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. బ్యాలెట్‌ పేపర్లు మార్చి పోలింగ్‌ను ప్రారంభించారు.

చిత్తూరు: జిల్లాలోని బి.కొత్తకోట పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో దొంగ ఓట్ల బెడద నెలకొంది. దొంగ ఓట్లు వేసేందుకు బయట ప్రాంతాల వ్యక్తులు వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి...

అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్‌

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 12:01 PM