సామాజిక భద్రతలో ఆంధ్రా నం.1.. పెన్షన్లకు రూ.73,594 కోట్ల ఖర్చు: దేవినేని
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:46 PM
సామాజిక భద్రత అంశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, జల భద్రత వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని ప్రశంసించారు.
అమరావతి, సెప్టెంబరు 01: సామాజిక భద్రత అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం 21 రకాల పింఛన్లకు రూ.73,594 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని గొల్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి, సంక్షేమం, జల భద్రత.. ఈ మూడు అంశాలకూ సీఎం చంద్రబాబు నాయుడు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు.
పట్టిసీమ, పురుషోత్తమపట్నం, వెలిగొండ ప్రాజెక్టులతో రాష్ట్రానికి జల భద్రతనిచ్చామని దేవినేని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా సమగ్ర నిర్వహణతో అన్ని ప్రాంతాలకూ నీటిని అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు దూరదృష్టితోనే రాష్ట్రంలో నీటి వనరుల సమగ్ర నిర్వహణ సాధ్యమవుతోందని వివరించారు. ఏలేరు రిజర్వాయర్‌కు పునరుజ్జీవం పోసి.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు పిఠాపురం, పాయకరావుపేట ప్రాంతాలకు గోదావరి జలాలు అందిస్తామని భరోసా కల్పించారు.
రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్నీ కూటమి ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని టీడీపీ సీనియర్ నేత అన్నారు. 8 మంది పిల్లలు ఉన్న కుటుంబానికి కూడా 'తల్లికి వందనం' పథకం అమలు చేస్తోందన్నారు. ఇదే సమయంలో వైసీపీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ హయాంలో 10 లక్షల మంది అర్హుల పింఛన్లను తొలగించారని ఆరోపించారు. పెన్షన్ సొమ్మును రూ.1,000 పెంచేందుకు ఐదేళ్లు కాలయాపన చేశారని, దీంతో ఒక్కో లబ్ధిదారుడికి రూ.28 వేల నష్టం వాటిల్లిందని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ ఇప్పుడు క్రెడిట్ చోరీ డ్రామాలాడుతోందని ఫైరయ్యారు. ఒక్కో ప్రాంతంలో ఒక మాట మాట్లాడుతూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఇవీ చదవండి:
‘ఆపరేషన్ సిందూర్’లో అదరగొట్టిన ఎస్-400కు మరో ఆర్డర్!
పీఎన్బీలో కరెన్సీ చెస్ట్‌లో నకలీ నోట్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్