‘ఆపరేషన్ సిందూర్’లో అదరగొట్టిన ఎస్-400కు మరో ఆర్డర్!
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:34 PM
'ఆపరేషన్ సిందూర్'లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలకు భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 5 కొత్త వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు రష్యా అంగీకరించినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: 'ఆపరేషన్ సిందూర్'లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలకు భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత వైమానిక దళం కోసం మరో ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు జారీచేసిన టెండర్‌కు రష్యా స్పందించినట్లు సమాచారం. ఈ మేరకు 5 కొత్త వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు రష్యా అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత సైనిక వ్యవస్థలో 'సుదర్శన్'గా పిలుస్తున్న ఎస్-400.. గతేడాది ఆపరేషన్ సిందూర్‌లో అదరగొట్టింది. శత్రువుల వైపు నుంచి వచ్చిన ప్రమాదాలను విజయవంతంగా అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందని భారత రక్షణ వర్గాలు తెలిపాయి. ఎస్-400 పనితీరుకు సంబంధించి పశ్చిమ వైమానిక కమాండ్ అధిపతి ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా గతంలో ఓ పోడ్‌కాస్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన నిఘా విమానాన్ని 314 కి.మీ. దూరంలో ఎస్-400 కూల్చివేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంత దూరంలో భూమి నుంచి ప్రయోగించిన గగనతల రక్షణ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించడం అత్యంత అరుదని నాడు రక్షణ రంగంలో చర్చ కూడా జరిగింది.
ఎస్-400 అనేది ఒకే మిసైల్ కాదు. ఇందులో అత్యాధునిక రాడార్లు, కమాండ్ వ్యవస్థలు, వివిధ రకాల క్షిపణులు వంటి అనేక భాగాలుంటాయి. వీటిలోని కొన్ని క్షిపణులకు 400 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటుంది. దీంతో శత్రు విమానాలు భారత గగనతలానికి చేరకముందే వాటిని గుర్తించి ఎదుర్కోగలవు. ఈ కారణంగానే భారత్ తన బహుళస్థాయి వైమానిక రక్షణ వ్యవస్థలో ఎస్-400కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2018లో కుదిరిన తొలి ఒప్పందం ప్రకారం.. భారత్ మొత్తం 5 ఎస్-400 యూనిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు 4 యూనిట్లు భారత్‌కు అందాయి. ఇంకో యూనిట్ నవంబర్ నాటికి అందే అవకాశముంది. తాజాగా మరో 5 యూనిట్ల కోసం భారత్ ఆసక్తి చూపుతోంది.
ఇవీ చదవండి:
హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?
విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర