Share News

విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్‌ ధర

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:43 AM

విమాన ప్రయాణికులపై మరోసారి ఇంధన భారం పడే అవకాశం కనిపిస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు వినియోగించే ఏటీఎఫ్‌ ధరను చమురు సంస్థలు 5.46 శాతం మేర పెంచడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్‌ ధర
ATF Prices Hiked

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణికులపై మరోసారి ఇంధన భారం పడే అవకాశం కనిపిస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) ధరను చమురు సంస్థలు మంగళవారం(సెప్టెంబర్ 1) 5.46 శాతం మేర పెంచాయి. దీంతో లీటరు ఏటీఎఫ్‌ ధర రూ.121.28కి ఎగబాకింది. గత ఆగస్టు 1న లీటరుకు రూ.5 చొప్పున పెంచగా.. తాజాగా మరో రూ.6.28 పెరిగింది.


ఫలితంగా విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు మరింత పెరగనున్నాయి. సాధారణంగా విమాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్‌ వాటా 40 శాతం వరకు ఉంటుంది. దీంతో ఇంధన ధరల పెరుగుదల నేరుగా విమానయాన సంస్థల ఖర్చులపై ప్రభావం చూపనుంది. అయితే.. ఏటీఎఫ్‌ ధరలు పెరగడంతో విమాన టికెట్ల ధరలను వెంటనే పెంచాల్సిన అవసరం లేదు. ఇంధన వ్యయం గణనీయంగా పెరగడంతో విమానయాన సంస్థలు తమ ఖర్చులను సమతుల్యం చేసుకునేందుకు టికెట్‌ ధరలు, ఇంధన సర్‌ఛార్జీలు సహా ఇతర రేట్లను పెంచుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు, విదేశీ మారకపు విలువ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటీఎఫ్‌ ధరలను చమురు సంస్థలు ప్రతి నెలా సవరిస్తుంటాయి.


భగ్గుమన్న కమర్షియల్ ఎల్పీజీ రేటు

మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలు వినియోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధర కూడా పెరిగింది. సిలిండర్‌పై రూ.9.50 పెంచడంతో ప్రస్తుతం ఆ ధర రూ.2,747.50కు చేరింది. 5 కిలోల సిలిండర్‌ ధర రూ.762 నుంచి రూ.764కు పెరిగింది. కాగా.. జులై, ఆగస్టు నెలల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా.. రూ.192, రూ.183.50 చొప్పున తగ్గాయి. అయితే.. గృహ అవసరాలకు వినియోగించిన 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రేట్లు సహా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి.


ఇవీ చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే..

దేశంలో చిప్‌ల తయారీకి రూ.1.27 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు

Updated Date - Sep 01 , 2026 | 11:48 AM