Share News

దేశంలో చిప్‌ల తయారీకి రూ.1.27 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:56 AM

దేశంలో సెమీకండక్టర్ల (చిప్‌) తయారీని ప్రోత్సహించేందుకు ఏకంగా రూ.1.27 లక్షల కోట్ల కేటాయింపులతో రూపొందించిన ‘సెమీకాన్‌ 2.0’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది....

దేశంలో చిప్‌ల తయారీకి రూ.1.27 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు

సెమీకాన్‌ 2.0 పథకాన్ని ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో సెమీకండక్టర్ల (చిప్‌) తయారీని ప్రోత్సహించేందుకు ఏకంగా రూ.1.27 లక్షల కోట్ల కేటాయింపులతో రూపొందించిన ‘సెమీకాన్‌ 2.0’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకానికి అర్హతలతో పాటు ఈ రంగ పరిశ్రమలకు అందించనున్న ప్రోత్సాహకాల వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా చిప్‌ తయారీ, అసెంబ్లింగ్‌ ప్లాంట్లకు రూ.50 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల పెట్టుబడిపై 25ు నుంచి 40ు వరకు ఆర్థిక మద్దతు ఇవ్వనుంది. అలాగే, దేశీయంగా చిప్‌ డిజైనింగ్‌, ఆర్‌ అండ్‌ డీని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆర్‌ అండ్‌ డీ వ్యయంలో 75ు ప్రోత్సాహకంగా లభించనుంది. సెమీకండక్టర్‌ నిపుణుల అభివృద్ధి సైతం ఇదే స్థాయి ప్రోత్సాహకాలు లభించనున్నాయి. దేశంలో ఓఎల్‌ఈడీ, మైక్రో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టెక్నాలజీ డిస్‌ప్లేల తయారీకి సైతం ఈ పథకం మద్దతివ్వనుంది. అంతేకాదు, ఈ పథకంలో భాగంగా అత్యాధునిక టెక్నాలజీ ఉత్పత్తుల్లో ఉపయోగించే 3-7 నానోమీటర్ల సూక్ష్మ చిప్‌లను దేశీయంగా అభివృద్ధి చేయడంపైనా దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వ్యూహాత్మక వనరుగా మారిన చిప్‌లు

ప్రపంచవ్యాప్తంగా చిప్‌లు వ్యూహాత్మక వనరుగా మారాయి. ఎందుకంటే, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధితో ఆధునిక చిప్‌లు, మెమొరీ ఉత్పత్తులకు భారీగా డిమాండ్‌ నెలకొంది. అదే సమయంలో సరఫరా అవాంతరాలు, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాలు వేగంగా మారుతుండటంతో ఈ రంగంలోని అంతర్జాతీయ దిగ్గజాలు చిప్‌ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించుకోవడంతోపాటు చైనా, తైవాన్‌ వంటి చిప్‌ తయారీ హబ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించడంతో పాటు మన స్టార్ట్‌పలు ఆధునిక చిప్‌ డిజైనింగ్‌ కోసం కృషి చేసే దిశగా ప్రోత్సహిస్తోంది.

రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు

సెమీకాన్‌ 2.0తో వచ్చే 5-7 ఏళ్లలో చిప్‌ల తయారీ ఇండస్ట్రీలోకి రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇండియా ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐఈఎ్‌సఏ) అంచనా వేసింది.


10 శాతం చిప్‌ల తయారీ భారత్‌లోనే..

సెమీకాన్‌ 2.0తో దేశీయంగా చిప్‌ల తయారీ భారీగా పెరగనుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. చిప్‌ డిజైన్‌, తయారీ, అందుకు అవసరమైన భారీ యంత్రాల విభాగాల్లో బలపడటం ద్వారా ప్రపంచ చిప్‌ల సరఫరా వ్యవస్థలో విడదీయలేని భాగంగా భారత్‌ మారాలనుకుంటోందన్నారు. మున్ముం దు సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్‌ మార్కెట్‌లో దాదాపు 10 శాతం భారత్‌లోనే కొలువుతీరనుందని ఆయన అన్నారు. సెమీకాన్‌ 2.0కు కేంద్ర క్యాబినెట్‌ ఈ జూలై 15న ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!

Updated Date - Sep 01 , 2026 | 03:56 AM