Share News

అమిత్ షా పర్యటన.. విజయవాడలో ‘నో ఫ్లైయింగ్ జోన్‌’ అమలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:37 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన నేపథ్యంలో అంబేడ్కర్ కళావేదిక పరిసరాల్లో నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేశారు.

అమిత్ షా పర్యటన.. విజయవాడలో ‘నో ఫ్లైయింగ్ జోన్‌’ అమలు
Amit Shah Vijayawada Visit

విజయవాడ, నవంబర్ 16: కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కళావేదికలో జరగనున్న రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘నో ఫ్లైయింగ్ జోన్‌’ను అమలులోకి తీసుకొచ్చారు.​ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కళా వేదికతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను ‘నో ఫ్లైయింగ్ జోన్’‌గా సీపీ రాజశేఖర్ బాబు ప్రకటించారు.


ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వీఐపీల పర్యటన ముగిసే వరకు ఎటువంటి డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, ఇతర ఎగిరే వస్తువులను ఎగురవేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా నిషేధిత పరిధిలో డ్రోన్లతో పాటు ఇతర ఎగిరే పరికరాలను వినియోగించ వద్దని తెలిపారు. అలా చేస్తే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా సదరు పరికరాలను స్వాధీనం చేసుకుంటామని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.


విజయవాడలో నేడు రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రామోజీరావు జయంతి సందర్భంగా తొమ్మిది మందికి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు. విజయవాడలోని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కళావేదికలో సాయంత్రం 5.30 గంటలకు కార్యక్రమం మొదలుకానుంది. ఇందుకోసం అమిత్ షా పుణె నుంచి విజయవాడకు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి సభా ప్రాంగణానికి చేరుకోనుండగా.. 6.30 గంటలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభంకానుంది. రెండు గంటలపాటు అవార్డుల ప్రదానోత్సవం కొనసాగనుంది.


ఇవి కూడా చదవండి...

ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 03:42 PM