Share News

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:26 PM

ఏపీలో గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. రెండో విడత ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక ప్రకటన జారీ చేశారు.

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!
AP Panchayat Elections

విజయవాడ, నవంబర్ 16: ఏపీలో గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి రెండో విడత (Phase-II) నోటిఫికేషన్ విడుదలైంది. రెండో విడత ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నవంబర్ 18 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. నవంబర్ 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, ఫలితాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్ 14న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, నవంబర్ 13న తొలి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రస్తుతం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ(నవంబర్ 15 నుంచి 17 వరకు) కొనసాగుతోంది.


రెండో విడత పూర్తి ఎన్నికల షెడ్యూల్

ఫారమ్-1లో ఎన్నికల నోటీసును రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. అదే రోజు వార్డు వారీ ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు.

  • నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ (ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు)

  • నవంబర్ 20 (సాయంత్రం 5.00 గం. వరకు): నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ.

  • నవంబర్ 21 (ఉదయం 8.00 గం. నుంచి): అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ).

  • నవంబర్ 22 (సాయంత్రం 5.00 గం. వరకు): తిరస్కరించబడిన నామినేషన్లపై సంబంధిత ఆర్డీవో (అప్పీలేట్ అధికారి) వద్ద అప్పీలు చేసుకునే అవకాశం.

  • నవంబర్ 23: అప్పీలేట్ అధికారి ద్వారా అప్పీళ్ల పరిష్కారం.

  • నవంబర్ 24 (మధ్యాహ్నం 3.00 గం. వరకు): అభ్యర్థిత్వాల ఉపసంహరణకు తుది గడువు.

  • నవంబర్ 24 (మధ్యాహ్నం 3.00 గం. తర్వాత): బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ.

  • నవంబర్ 29 (ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు) గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణ.

  • నవంబర్ 29 (మధ్యాహ్నం 2.00 గం. నుంచి): ఓట్ల లెక్కింపు ప్రారంభం, పూర్తయిన వెంటనే ఫలితాల ప్రకటన.


ఉప సర్పంచ్ ఎన్నిక

ఫలితాలు ప్రకటించిన రోజే (నవంబర్ 29న) ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఫలితాల రోజున ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే, మరుసటి రోజు (సెలవు దినమైనప్పటికీ) తప్పనిసరిగా నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అవసరమైన చోట్ల నవంబర్ 30న (ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు) రీపోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రీపోలింగ్ జరిగిన పంచాయతీల్లో ఆ ఫలితాలు వెలువడిన తర్వాతే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కోర్టు స్టే ఉన్న.. పరిపాలనా, న్యాయపరమైన అడ్డంకులు ఉన్న గ్రామ పంచాయతీలు, పదవులకు ఎన్నికల నోటీసు జారీ చేయవద్దని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


ఎన్నికలు జరిగే జిల్లాలు ఇవే

  • ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో రెండో విడత ఎన్నికలు.

  • గోదావరి జిల్లాలు: పోలవరం, తూర్పు గోదావరి, కాకినాడ, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ పోరు.

  • కోస్తాంధ్ర: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని నిర్దేశిత మండలాల్లో ఎన్నికల నిర్వహణ.

  • రాయలసీమ: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో రెండో విడత పోలింగ్.


ఇవి కూడా చదవండి...

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 12:50 PM