Share News

రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం: మంత్రి నారాయణ

ABN , Publish Date - Jun 04 , 2026 | 09:45 AM

రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు.

రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం: మంత్రి నారాయణ
Minister Narayana

అమరావతి, జూన్ 4: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రైతుల భూములు వెనక్కి తిరిగి ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించారు. భవనాలు, రోడ్లు, పైపు లైన్‌ల నిర్మాణం పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమేనా అని అడిగారు. మాజీ సీఎంగా చేసిన వ్యక్తి అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారంటూ నారాయణ విరుచుకుపడ్డారు.


రాజధాని ప్రాంతంలో మంత్రి పర్యటన

ఈరోజు(గురువారం) రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి పర్యటించారు. కొండవీటి వాగు అభివృద్ధి పనులను పరిశీలించారు. N9, N8, N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనులను పరిశీలించారు. బ్రిడ్జిల కింద కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టిని తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్నచోట మరింత వెడల్పు చేయాలని సూచించారు. నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను నారాయణ పరిశీలించారు.


రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు, వాగుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ట్రంక్ రోడ్లపై 43, ఎల్పీఎస్ జోన్లలో 32 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టిని తొలగిస్తున్నట్లు తెలిపారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయిందన్నారు. భారీ వర్షాలు వస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెడుతున్నారు:కేశినేని నాని

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 09:56 AM