Share News

కేసులున్నా పదోన్నతి!

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:15 AM

పదోన్నతుల విషయంలో రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూ టీ తహశీల్దార్‌, తహశీల్దార్లపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అభియోగాలు.....

కేసులున్నా పదోన్నతి!

  • రెవెన్యూ శాఖ ప్రత్యేక మెమో

  • డీటీ, తహశీల్దార్‌, డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుల కొరతను అధిగమించేందుకే!

  • దీనిపై పెద్దఎత్తున విమర్శలు

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): పదోన్నతుల విషయంలో రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూ టీ తహశీల్దార్‌, తహశీల్దార్లపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అభియోగాలు, ఏసీబీ తనిఖీల కేసులు, ఇతరత్రా సర్వీసుపరమైన విషయాల్లో.. సాధారణం అంటే తక్కువ తీవ్రత ఉన్న కేసులు పెండింగ్‌లో ఉన్నా సరే పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎస్‌ జి.సాయుప్రసాద్‌ మెమో జారీ చేశారు. రెవెన్యూలో కీలకమైన డీటీ, తహశీల్దార్‌, డిప్యూటీ కలెక్టర్‌(డీసీ) పోస్టుల కొరతను అధిగమించేందుకు పెద్ద ఎత్తున పదోన్నతులు ఇస్తున్నారు. అయితే పదోన్నతికి అర్హత ఉన్నవారిలో అనేక మందిపై ఏసీబీ తనిఖీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అనేక మందికి పదోన్నతులు పొందే అవకాశం పోతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయు. ఈ నేపథ్యంలో గతంలో ఉద్యోగుల పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఉటంకిస్తూ.. తక్కువ తీవ్రత ఉన్న ఏసీబీ కేసులు, ఇతర క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ డీటీలు, తహశీల్దార్లకు పదోన్నతులివ్వాలని సీసీఎల్‌ఏను ఆదేశిస్తూ సీఎస్‌ ఈ మెమో జారీ చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఏసీబీ కేసులున్న డీటీలకు కూడా తహశీల్దార్‌ పదోన్నతులు ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ డీపీసీలు నిర్వహిస్తోంది. ఇంతకు ముందే 20 మందికి పైగానే తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఇప్పుడు 300 మందికిపైగా డీటీలకు తహశీల్దార్‌ పదోన్నతులు ఇస్తున్నారు. ఇందులో 30 శాతం మందిపై ఏసీబీ కేసులు ఉన్నట్లు తెలిసింది. రెవెన్యూలో 420కిపైగా మండలాలకు రెగ్యులర్‌ తహశీల్దార్లు లేరు. అంతా ఇన్‌చార్జులతోనే నడచిపోతోంది. అధికారుల కొరత తీర్చేందుకే పదోన్నతుల ప్రక్రియను చేపట్టినా.. ఏసీబీ కేసులున్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వాలని మెమో ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మందికి లబ్ధి చేకూర్చేందుకే ఓ సంఘం నేత ఈ మెమో ఇప్పించడంలో కీలకపాత్ర వహించారని రెవెన్యూ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 05:15 AM