విజయవాడలో అక్టోబర్ 9 నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
ABN , Publish Date - Oct 08 , 2026 | 09:26 PM
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు ఒరిజినల్ బాండ్లను పరిశీలనకు తీసుకురావాలని విజయవాడ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈరోజు (గురువారం) అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ, అక్టోబర్ 8: అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు ఒరిజినల్ బాండ్లను పరిశీలనకు తీసుకురావాలని విజయవాడ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈరోజు (గురువారం) అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ పరిశీలన ప్రక్రియ అక్టోబర్ 9 (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతోందని ప్రకటించారు. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పత్రాలను పరిశీలిస్తామని వెల్లడించారు. కాగా ప్రభుత్వ నిర్ణయం మేరకు అగ్రిగోల్డ్ బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్.టి.ఆర్. జిల్లాలో ఈ కేంద్రాలు పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లలో ఉన్నాయి.
పరిశీలన ప్రక్రియ కోసం డిపాజిటర్లు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు సంబంధిత ఒరిజినల్ బాండ్లను తప్పనిసరిగా తీసుకురావాలని పోలీసులు సూచించారు. వాటి కలర్ జిరాక్స్ ప్రతులపై సంతకం చేసి ప్రత్యేక బృందాలకు సమర్పించి, రసీదు పొందాలని చెప్పారు. డిపాజిటర్ జీవించి ఉంటే.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్, ఏజెంట్ వివరాలు తీసుకురావాలని వివరించారు. అదే డిపాజిటర్ మరణించి ఉంటే.. పై పేర్కొన్న పత్రాలతో పాటు డిపాజిటర్ మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ గుర్తింపు పత్రాలు, రేషన్ కార్డు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణిస్తే.. ఇద్దరి మరణ ధ్రువీకరణ పత్రాలు సహా ఇతర అన్ని నిర్ధారణ పత్రాలూ అవసరమన్నారు.
షెడ్యూల్ వివరాలు
1. 09.10.2026 & 10.10.2026 తేదీలలో రెడ్డిగూడెం మండలం
2. 12.10.2026 & 13.10.2026 తేదీలలో ఏ కొండూరు మండలం
3. 14.10.2026 & 15.10.2026 తేదీలలో గంపలగూడెం మండలం
4. 16.10.2026 & 17.10.2026 తేదీలలో జీ కొండూరు మండలం
ఈ వార్తలూ చదవండి
గుడ్ న్యూస్.. దసరా వేళ దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్..
ఏపీ పోర్టుల అభివృద్ధిపై మహారాష్ట్ర మంత్రి ప్రశంసలు..