Share News

ఏపీ పోర్టుల అభివృద్ధిపై మహారాష్ట్ర మంత్రి ప్రశంసలు.. ల్యాండ్ లార్డ్ మోడల్‌పై ఆసక్తి

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:33 PM

ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధి, పురోగతిపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు.

ఏపీ పోర్టుల అభివృద్ధిపై మహారాష్ట్ర మంత్రి ప్రశంసలు.. ల్యాండ్ లార్డ్ మోడల్‌పై ఆసక్తి
BC Janardhan Reddy

అమరావతి, అక్టోబర్ 8: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధి, పురోగతిపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఈరోజు(గురువారం) సచివాలయంలోని ఆర్‌ అండ్ బీ, ఐ అండ్ ఐ శాఖ కార్యాలయానికి విచ్చేసిన నితేష్ రాణేకు.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, సీఈ రాఘవరావు, ఇతర ఉన్నతాధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, పీపీపీ విధానం, నూతన మారిటైమ్ పాలసీపై మహారాష్ట్ర ప్రతినిధి బృందానికి ఏపీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


దేశంలోనే ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్‌లో 3 గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధిపై మంత్రి నితేష్ రాణే ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పోర్టుల్లో మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ సంస్థలకు ఆపరేషన్లు అప్పగించే ఏపీ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని మహారాష్ట్ర మంత్రి అన్నారు. ఒక్కో గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సుమారు రూ.4,500 కోట్ల పెట్టుబడితో 2027 నాటికి పోర్టుల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి సముద్రతీరం లేని రాష్ట్రాల ఎగుమతులు, దిగుమతులకు ఏపీ పోర్టులు కీలకంగా మారతాయన్నారు. దుగరాజపట్నం, మచిలీపట్నంలో షిప్‌బిల్డింగ్ అభివృద్ధి.. కాకినాడలో షిప్‌బిల్డింగ్ ప్రతిపాదన పురోగతిలో ఉందని ఏపీ మంత్రి తెలిపారు.


మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ.. మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి విధానంపై మహారాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేశారు. విజయవాడ-అమరావతి వాటర్ మెట్రోకు అనుమతులు, సీప్లేన్ సేవల కోసం 9 ప్రాంతాల గుర్తింపు, శ్రీశైలం-విజయవాడ మధ్య ట్రయల్ రన్ వంటి అంశాలను ఏపీ మంత్రి వివరించారు. రాయలసీమ నుంచి హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతులకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు నిర్మిస్తున్నామని మహారాష్ట్ర మంత్రికి మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. తీరప్రాంతంలోని 20 వేల ఎకరాల ఉప్పు భూములతో ల్యాండ్ బ్యాంక్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు.


ఏపీలో పోర్టులు, రైల్వేలు, జాతీయ రహదారుల పనుల వేగవంతానికి మంత్రి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్ కమిటీపై మహారాష్ట్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. మారిటైమ్, షిప్‌బిల్డింగ్, ఫిషింగ్ హార్బర్లలో యువతకు నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఏపీ మారిటైమ్ బోర్డు తెలిపింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ సీఈఓ ప్రదీప్.పి, సీపీఓ కెప్టెన్ ప్రవీణ్ ఖారా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనీష్ మెట్కర్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులే లక్ష్యం.. ఎంఓయూలను సాకారం చేస్తాం: సీఎం చంద్రబాబు

గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించడం శుభపరిణామం: హోంమంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 04:42 PM