వికారాబాద్‌లో నకిలీ బంగారం కలకలం
ABN , Publish Date - Oct 08 , 2026 | 03:51 PM
వికారాబాద్ జిల్లాలోని పరిగిలో నకిలీ బంగారం ముఠా మోసాలు కలకలం రేపుతున్నాయి. అమాయకులను ముంచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
వికారాబాద్ జిల్లా, అక్టోబర్ 8: జిల్లాలోని పరిగిలో నకిలీ బంగారం ముఠా మోసాలు కలకలం రేపుతున్నాయి. అమాయకులను మోసం చేస్తూ నకిలీ బంగారాన్ని అంటగడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ముఠాను అదుపులోకి తీసుకుని నగదును రికవరీ చేసిన పోలీసులు.. వారిని వదిలేశారు. అయితే ఆ తరువాతి రోజు మరో బాధితుడు వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నకిలీ బంగారం ముఠా ఇంకా ఎంతమందిని మోసం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..
అమాయకులను ముంచేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాగభూషణం, నాగరాజు, శివమ్మ, నాగలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, నకిలీ బంగారం బిస్కెట్లు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. తొండపల్లి ప్రాంతానికి చెందిన ఓ టైలర్‌కు అసలు బంగారం చూపించి నమ్మించిన నిందితులు.. రూ.3 లక్షలకు నకిలీ బంగారం అంటగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్.. వారి నుంచి నగదును రికవరీ చేశారు.
అయితే నిందితులను వదిలేసిన మరుసటి రోజే మరో బాధితుడు వెలుగులోకి వచ్చాడు. పరిగికి చెందిన ఓ వ్యాపారికి రూ.7 లక్షల విలువైన బంగారం బిస్కెట్ ఇస్తామని నమ్మించిన కేటుగాళ్లు.. అతడి నుంచి రూ.3 లక్షలు తీసుకుని కంచు ముక్కను ఇచ్చినట్లు సమాచారం. అయితే మోసపోయి రెండు నెలలైనా పరువు పోతుందన్న భయంతో బాధితులు ఇన్నాళ్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. నిందితులను వదిలేశాక మరో బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరువు పోతుందన్న ఆందోళనతో మీడియా ముందుకు రావడానికి మరి కొందరు బాధితులు విముఖత చూపుతున్నట్లు సమాచారం. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ వచ్చే అపరిచితులను నమ్మి మోసపోవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసింది.. 92 లక్షల ఓట్లు తొలగించారంటూ మహేశ్ ఆరోపణలు
లోక్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. మహేశ్ గౌడ్, మంత్రుల అరెస్ట్
Read Latest Telangana News And Telugu News