మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్‌కు పోటెత్తిన వినతులు..
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:00 PM
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రజలు, ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు హాజరై తమ సమస్యలను విన్నవించారు.
అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రజలు, ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు హాజరై తమ సమస్యలను విన్నవించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను లోకేశ్ ఓపికగా విన్నారు. అర్జీలను స్వీకరించిన అనంతరం స్వయంగా వాటిని పరిశీలించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రజాదర్బార్‌లో ప్రధానంగా ఉద్యోగ, విద్య, సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతులకు సంబంధించిన పలు సమస్యలు మంత్రి లోకేశ్ దృష్టికి వచ్చాయి. సంక్షేమ, విద్యా సహాయకులకు పదోన్నతి అవకాశాలు కల్పించాలని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా బంజారా తండాల్లోని ఆలయాల పూజారులకు నెలకు రూ.15 వేల గౌరవ వేతనం అందించాలని బంజారా ధర్మ రక్షా సమితి ప్రతినిధులు కోరారు. ధూప, దీప, నైవేద్య పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు గౌరవ వేతనం పెంచాలని పలువురు కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రి లోకేశ్‌కు వినతి పత్రాలు అందజేశారు.
మరోవైపు, చిత్తూరు జిల్లా చీకటిపల్లెలో సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు శ్మశానవాటికకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించిన లోకేశ్.. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ప్రజాదర్బార్ లక్ష్యమని, అర్జీలపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్.. తర్వాత నిరసన’ ఫార్ములా!
గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించడం శుభపరిణామం: హోంమంత్రి అనిత