Share News

సీఎం చంద్రబాబు అన్ని సౌకర్యాలు కల్పించారు: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు

ABN , Publish Date - Aug 19 , 2026 | 03:16 PM

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్కులు అందజేశారు. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఎం చంద్రబాబును ప్రాజెక్టు నిర్వాసితులు కలిశారు.

సీఎం చంద్రబాబు అన్ని సౌకర్యాలు కల్పించారు: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు
AP CM Chandrababu

అమరావతి, ఆగస్టు19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన సాయాన్ని తాము మర్చిపోలేమన్నారు. తమ 30 ఏళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు జీవితంలో పూర్తవుతుందని తాము అనుకోలేదని అన్నారు. చూడలేం అనుకున్న ప్రాజెక్టును చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని నిర్వాసితులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.


వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు నాయుడు చెక్కులు అందజేశారు. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఎంను ప్రాజెక్టు నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా వారికి రూ.200 కోట్ల మేర పరిహారం చెక్కులు అందించారు. అనంతరం నిర్వాసితులుపై విధంగా స్పందించారు.


ప్రాజెక్ట్ పనులతోపాటు నిర్వాసితులు ముఖ్యం: మంత్రి నిమ్మల

వెలుగొండ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం ఓ క్రమపద్దతిలో పూర్తి చేసిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్లు వైఎస్ జగన్ జాతికి ఆంకితం చేయటం ప్రపంచంలో 8వ వింత అని అభివర్ణించారు. నిర్వాసితులకు రూ.900 కోట్ల పరిహారం చెల్లింపులో నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పైసా కూడా చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు.


వెలుగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయటం ఎంత ముఖ్యమో.. నిర్వాసితులు కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితుల కోసం నిర్మించిన 7 కాలనీల్లో నాలుగింటిలో 100 శాతం మౌలిక వసతులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన 3 కాలనీల్లోని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


నిర్వాసితులకు మిగిలిన పరిహారం త్వరలో చెల్లిస్తాం: మంత్రి డోలా

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మిగిలిన రూ. 400 కోట్లు త్వరలోనే చెల్లిస్తామని సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ ఆగస్టులోనే నల్లమల్ల సాగర్‌కు నీరిస్తామని పేర్కొన్నారు. వెలుగొండ నిర్వాసితులను గొడ్డలి పార్టీ దారుణంగా మోసగించిందంటూ ఆయన మండిపడ్డారు. పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత ఆ పార్టీ నాయకుడికే చెల్లిందంటూ వైఎస్ జగన్ తీరును మంత్రి డోలా ఈ సందర్భంగా ఎండగట్టారు.


గతంలో చెప్పినట్లే.. మార్కాపురం జిల్లాను ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. వెలుగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబే తిరిగి ప్రారంభిస్తున్నారని గుర్తు చేశారు. గ్రామాలు ఖాళీ చేయాలని ఈ సందర్భంగా నిర్వాసితులకు మంత్రి డోలా విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు: నారాయణ

‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన

For More AP News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 03:54 PM