Share News

‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన

ABN , Publish Date - Aug 19 , 2026 | 02:56 PM

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన
Sushmita Patel On Revanth Reddy

వరంగల్ : కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పరకాల నియోజకవర్గ రాజకీయాలపై సుష్మితా పటేల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని అన్నారు. 'పొంగులేటి ముఖ్యమంత్రా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదు' అని సుష్మితా వ్యాఖ్యానించారు.


రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తన తండ్రి కొండా మురళీ కూడా సహకరించారని సుష్మితా పటేల్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయంలో కొండా మురళీ సహకారం ఉందని అన్నారు. అందుకు ప్రతిఫలంగా కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.

‘హామీ ఇవ్వలేదని ప్రమాణం చేస్తారా?’

కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఇక్కడి మైసమ్మపై ప్రమాణం చేయగలరా? అని సుష్మితా పటేల్ సవాల్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు.

పరకాల టికెట్‌పై సవాల్

రేవూరి ప్రకాశ్ రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని సుష్మితా పటేల్ ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తమ ఇలాఖాకు వచ్చి తమతో ఎందుకు పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.


రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు: సుష్మితా

రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన అవినీతిపై ఇప్పటివరకు రూ.200 కోట్ల వ్యవహారాన్ని మాత్రమే బయటపెట్టానని సుష్మితా పటేల్ ఆరోపించారు. తనపై కౌంటర్ ఇస్తే మరిన్ని విషయాలను బయటపెడతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల సమయానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారో, ఉండరో కూడా సందేహమేనని సుష్మితా పటేల్ వ్యాఖ్యానించారు.


Also Read:

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

Updated Date - Aug 19 , 2026 | 03:33 PM