పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..
ABN , Publish Date - Aug 19 , 2026 | 02:52 PM
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ పొరుగింటి 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ పొరుగింటి 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, కేసును త్వరితగతిన విచారించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు పుణె-నాసిక్ జాతీయ రహదారిని దిగ్బంధించారు (Pune Crime News).
పుణె జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాధిత బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. మంగళవారం అనారోగ్యంగా ఉండటంతో బాలిక పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని విషయాన్ని తెలుసుకున్న నిందితుడు బాలికను లైంగికంగా వేధించాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు (Pune Girl killed).
బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించారు. గంటల పాటు వెతికినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి నిందితుడు కూడా వెతికాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి కనిపించాడు (Maharashtra Crime News).
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఓ వాగు సమీపంలోని చెట్టు కింద బాలిక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనాస్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించి కీలక ఆధారాలను సేకరించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని, కేసును త్వరితగతిన విచారించాలని బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Also Read:
నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం
10 ఏళ్ల నిరీక్షణకు తెర.. కేరళ మహిళతో స్కాట్లాండ్ రాజకీయ నేత పెళ్లి