10 ఏళ్ల నిరీక్షణకు తెర.. కేరళ మహిళతో స్కాట్లాండ్ రాజకీయ నేత పెళ్లి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:37 PM
స్కాట్లాండ్ రాజకీయ నాయకుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్ ప్రేమకథ చివరకు పెళ్లితో సుఖాంతమైంది. పదేళ్ల నిరీక్షణ అనంతరం నిధిన్ కోరుకున్నట్టుగానే త్రిశూర్‌లోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో వీరిద్దరూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.
కేరళ, ఆగస్టు 19: ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో తెలియదు. కొందరు తమ ప్రేమలో సక్సెస్ కాగా, మరికొందరు విఫలం అవుతుంటారు. ఇంకొందరు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు. అలానే స్కాట్లాండ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు పదేళ్లు నిరీక్షించి.. చివరకు తాను ప్రేమించిన కేరళ మహిళను వివాహం చేసుకున్నాడు. మరి.. దేశం దాటిన ఈ ప్రేమకథ చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు (MSP), మాజీ యూకే ఎంపీ మార్టిన్ డే(55) (Martyn Day) కేరళకు చెందిన నిధిన్ చంద్(49) అనే మహిళను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. త్రిశూర్ జిల్లాలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో వీరి వివాహం జరిగింది. గురువాయూరప్ప సన్నిధిలో పెళ్లి చేసుకోవాలన్న ఆమె దశాబ్దపు కల తాజాగా నెరవేరింది. వీరి పెళ్లి అత్యంత సమీప బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.
2016లో పరిచయం:
నిధిన్ 2008లో ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి బ్రిటన్‌కు వెళ్ళింది. ఆ సమయంలో యూకే ప్రభుత్వం తన వలస విధానాలలో పెద్ద మార్పులు ప్రవేశపెట్టింది. యూకే ప్రభుత్వం నిధిన్‌తో సహా వేలాది మంది వీసాలను రద్దు చేసింది. దీంతో అందరిలాగా సామాన్లు సర్ధుకుని వెళ్లిపోకుండా.. ఈ అంశంపై యూకే ప్రభుత్వంపై నిధిన్ పోరాడింది. ఈ క్రమంలోనే స్థానికంగా నిధిన్ బాగా గుర్తింపు సంపాదించింది. 2016లో మార్టిన్‌తో నిధిన్ కు తొలిసారి పరిచయం ఏర్పడింది. సమాజంలో సమస్యలపై ఆమె పోరాడుతున్న తీరుకు మార్టిన్ ఫిదా అయ్యారు. ఒకసారి నిధిన్‌కు మార్టిన్ లవ్ ప్రపోజ్ చేశారు. ఆ సమయంలో తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నట్లు నిధిన్ తెలిపింది. అయినప్పటికీ ఆమెను చేసుకునేందుకు మార్టిన్ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో అతడి ప్రేమను అంగీకరించిన నిధిన్.. పెళ్లి మాత్రం గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో చేసుకోవాలని కోరింది.
నిధిన్ కోరిక మేరకు గురువాయూర్ ఆలయంలోనే తమ వివాహం చేసుకునేందుకు మార్టిన్ ప్రయత్నించాడు. 2018, 2019, 2023లో కేరళను సందర్శించినప్పటికీ కేరళ వరదలు, కోవిడ్ మహమ్మారి, కుటుంబంలో ఆరోగ్య సమస్య వంటి వరుస సంఘటనల కారణంగా వివాహం సాధ్యపడలేదు. ఎట్టకేలకు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత నిధిన్ కోరిన గురువాయూర్ ఆలయంలోనే వారి పెళ్లి జరిగింది. మార్టిన్ 1999లో యూకే ఎంపీగా పని చేశాడు. తొమ్మిదేళ్ల పాటు వెస్ట్ మిన్ స్టర్ ఎంపీగా పని చేశాడు. అంతేకంటే ముందు రిటైల్ బ్యాంకర్, కౌన్సిలర్‌గా పని చేశాడు. ప్రస్తుతం స్టాటిష్ పార్లమెంట్‌లో భారత్ కోసం ఏర్పాటు చేసిన అఖిల పక్ష పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షత వహిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం