Share News

హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:59 PM

అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. హోర్ముజ్‌ మూసివేత కొనసాగుతుందని ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు.

హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్
Donald Trump - Hormuz New Map

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. హోర్ముజ్‌ మూసివేత కొనసాగుతుందని ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. హోర్ముజ్ యూఎస్‌కు చెందిన ప్రాంతమని చెప్పే మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హోర్ముజ్‌ను యూఎస్‌కు చెందిన ప్రాంతంగా ప్రకటిస్తామని గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్న ట్రంప్ చివరకు కొత్త మ్యాపుతో వివాదాన్ని మరో మలుపు తిప్పారు.


హోర్ముజ్‌ పూర్తిగా తమ అధీనంలో ఉందని చాలా కాలంగా ట్రంప్ చెబుతున్నారు. ఈ విషయమై సోమవారం విలేకరులతో మాట్లాడుతూ హోర్ముజ్‌ను యూఎస్‌కు చెందిన ప్రాంతంగా ప్రకటించాలన్న ఆలోచన మంచిదేనని అన్నారు. ‘అది గొప్ప ఐడియానే. ఇప్పటికే హోర్ముజ్‌ చుట్టూ నిర్బంధాన్ని అమలు చేస్తున్నాము. పూర్తిగా అది మా అధీనంలో ఉంది. కాబట్టి యూఎస్‌కు చెందిన ప్రాంతంగా కూడా ప్రకటించవచ్చు’ అని ట్రంప్ అన్నారు. అంతకుముందు మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ తాను త్వరలో హోర్ముజ్‌ను యూఎస్‌కు చెందిన ప్రాంతంగా ప్రకటిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ షేర్ చేసిన మ్యాప్ కలకలం రేపుతోంది.


అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్న టాప్ ఇరాన్ నేత మొహమ్మద్ ఘాలిబాఫ్ మాత్రం హోర్ముజ్‌ను మూసే ఉంచామని స్పష్టం చేశారు. అమెరికా తన హామీలకు కట్టుబడి ఉండే వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు. ‘గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం అమెరికా తన హామీలకు కట్టుబడే వరకూ హార్ముజ్‌ను తెరిచే ప్రసక్తే లేదు’ అని ఇరాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. యూఎస్ తన నిర్బంధాన్ని ఎత్తివేయాలని, చమురు వాణిజ్యంపై ఆంక్షలు తొలగించి విదేశాల్లోని ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, మంగళవారం హోర్ముజ్‌లోని ఓ సరకు రవాణా నౌకపై దాడి జరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నౌకలోని ఇంజిన్ రూమ్‌పై దాడి జరిగిందని, సిబ్బందిని తాము రక్షించామని ఒమన్ కోస్ట్ గార్డు ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 18 , 2026 | 07:51 PM