కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం.. అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్
ABN , Publish Date - Jun 08 , 2026 | 09:15 PM
అనుమతించిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, జూన్8 (ఆంధ్రజ్యోతి): అనుమతించిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. ఈరోజు(సోమవారం) పీసీబీ అందించిన ల్యాబ్ రిపోర్టుపై డిప్యూటీ సీఎం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కళ్ల ముందే గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులూ ఏం చేశారు..? అని ప్రశ్నించారు.
వాటికి షోకాజ్ నోటీసు ఇవ్వాలి..
ఆంధ్రపేపర్ మిల్లు యాజమాన్యం తమ వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు. ల్యాబ్ నివేదికలో తేలిన లోపాలను యుద్ధప్రాతిపదికన సరిచేసుకోవాలని సూచించారు. ఆంధ్రపేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఒక్క చుక్క మురుగునీరు కూడా శుద్ధి కాకుండా గోదావరిలోకి వెళ్లకూడదని ఆదేశించారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో మాట్లాడతా..
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎంత మురుగునీరు వస్తోంది? అని అధికారులను నిలదీశారు. భవిష్యత్తులో జనాభా పెరిగితే ఎంత వస్తుంది..? అనే అంశాలపై పూర్తి సర్వే చేయాలని సూచించారు. మురుగునీటిని శుద్ధి చేయడానికి ఎన్ని ప్లాంట్లు అవసరమవుతాయి..?, ఎంత ఖర్చు అవుతుంది..? అని ప్రశ్నించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి ప్రక్షాళనకు అవసరమైతే కేంద్రప్రభుత్వం సహాయం కోసం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి
నువ్వు ఎంత రెచ్చగొట్టిన నేను తొందరపడను.. సీఎంకి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News