బాధ్యతగా వన్యప్రాణి సంరక్షణ: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Mar 03 , 2026 | 10:34 AM
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ - వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని పవన్ చెప్పారు.
అమరావతి, మార్చి 3: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి కందుల దుర్గేశ్ (Minister Kandula Durgesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ - వన్యప్రాణుల సంఘర్షణను నివారించి, సహాయం అందించే 'హనుమాన్' ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా ఆవిష్కరించారు.
అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ - వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఈ ప్రాజెక్టులో 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని పవన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 19 అత్యవసర సహాయ బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏడు చోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన, మరణించిన వారికి 4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా పంట నష్ట పరిహారం ఇస్తున్నామని వెల్లడించారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెచ్చి అడవి ఏనుగులను కట్టడి చేశామని ఉపముఖ్యమంత్రి చెప్పారు.
వన్యప్రాణి సంరక్షణను బాధ్యతగా చేపట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకూ స్థానం ఉందని ఆయన అన్నారు. హనుమాన్ ప్రాజెక్టును పకడ్బంధీగా రూపొందించిన అటవీ శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షణ ప్రదర్శనను పవన్ తిలకించారు. అటవీ వన్యప్రాణి సంరక్షణలో పాలుపంచుకున్న అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అటవీ శాఖకు రెస్క్యూ వాహనాలు, అంబులెన్సులను డిప్యూటీ సీఎం పవన్ అందజేశారు.
ఇవి కూడా చదవండి...
గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే
Read Latest AP News And Telugu News