గ్రేట్ ఫ్రెండ్ మోదీకి ధన్యవాదాలు చెప్పా: నెతన్యాహు
ABN , Publish Date - Mar 03 , 2026 | 10:06 AM
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ దాడిలో ధ్వంసం అయిన సినగాగ్ దగ్గరకు సోమవారం వెళ్లారు. భారీ భద్రత మధ్య అక్కడ పర్యటించారు.
జెరూసలేం, మార్చి 2: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా దాడులు చేస్తోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు చనిపోయారు. సుప్రీం లీడర్ మరణంతో ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్, అమెరికాపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్.. బీట్ షెమేష్‌లోని సినగాగ్ (యూదుల ప్రార్థనా మందిరం) దాని కింద ఉన్న బాంబు షెల్టర్‌పై ఇరాన్ నేరుగా బాలిస్టిక్ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. 28 మందికి పైగా గాయపడ్డారు.
ఇరాన్ దాడిలో ధ్వంసం అయిన సినగాగ్ దగ్గరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెళ్లారు. భారీ భద్రత మధ్య అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా భారత దేశానికి చెందిన ఓ జాతీయ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గ్రేట్ ఫ్రెండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. నిన్న ఆయనతో చాలాసేపు మాట్లాడాను. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలిపాను. ఆయనతో ఏం మాట్లాడానో వివరంగా ఈ సమయంలో చెప్పలేను. మోదీతో పాటు మరికొంతమంది నేతలతో కూడా మాట్లాడాను’ అని అన్నారు.
రక్షణ కోసమే ఇరాన్‌పై దాడి
తమ దేశాన్ని రక్షించుకునేందుకే ఇరాన్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రపంచానికి ఉన్న ముప్పును అమెరికాతో కలిసి తొలగించామని చెప్పారు. ఇరాన్ నిరంకుశ పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని, పౌరులను రక్షించేందుకు తాము నిరంకుశ పాలకులను లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. ఇజ్రాయెల్, అమెరికాలను ఇరాన్ బెదిరిస్తోందని గతంలోనే చెప్పానని అన్నారు.