Share News

వైసీపీ మోసాలు ‘మూసివేత’!

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:05 AM

వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన మోసాలను ‘మూసివేత’ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.

వైసీపీ మోసాలు ‘మూసివేత’!

  • నాటి అక్రమాలు అటకెక్కించడమే లక్ష్యం

  • జగనన్న ఇళ్ల మెటీరియల్‌లో భారీ మోసం

  • నాటి నేతలు, అధికారుల కుమ్మక్కే కారణం

  • స్పష్టంగా చెప్పిన విజిలెన్స్‌ విచారణ నివేదిక

  • తాజాగా జిల్లాల్లో గోదాముల మూసివేతకు హౌసింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సర్క్యులర్‌

  • వేల టన్నుల స్టీలు, సామగ్రి ఖాళీకి ఆదేశం

  • సీఎం చర్యల పేరిట మొత్తానికే ‘మాయ’

  • మరి దోచిన సొమ్ము, విచారణ సంగతేంటి?

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన మోసాలను ‘మూసివేత’ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఆయా అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న హౌసింగ్‌ గోదాముల్లో తుప్పుపట్టిపోయిన 16 వేల టన్నులకు పైగా స్టీలును తీసేయాలని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పి. అరుణ్‌బాబు ఆదేశించారు. అదేవిధంగా చాలాకాలంగా వినియోగించకపోవడంతో బండరాళ్లుగా మారిన 8 వేల టన్నుల సిమెంట్‌, ఎందుకూ పనికిరాకుండా పాడైపోతున్న రూ.వందల కోట్ల విలువైన ఇతర గృహోపకరణ వస్తువులను గోదాముల నుంచి ఖాళీ చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లోని హౌసింగ్‌ అధికారులకు సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నెలాఖరులోపు గోడౌన్లలోని స్టాక్‌ను క్లియర్‌ చేయకపోతే సంబంధిత ఏఈ, డీఈ, ఈఈ, డీహెచ్‌హెచ్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదాములు ఖాళీ చేసే ప్రక్రియలో పురోగతిని ప్రతి రోజూ హౌసింగ్‌ హెడ్‌ ఆఫీసుకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్పర్శ్‌’ విధానం అమల్లోకి వచ్చినందున పేదల ఇళ్లకు సంబంధించిన బిల్లుల డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోనే జమ అవుతాయి.


కాబట్టి ఇక మీదట పేదల ఇళ్ల నిర్మాణం కోసం స్టీలు, సిమెంట్‌, ఇతర సామగ్రిని సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం ద్వారా కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఈనెల 1 నుంచి ‘ఏపీ నిర్మాణ్‌ పోర్టల్‌’ ద్వారా జిల్లాల్లో సిమెంట్‌ సేకరించకూడదు. కాబట్టి ప్రస్తు తం అన్ని జిల్లాల్లోనూ గొదాముల్లో పాడైపోతున్న ఆ స్టాక్‌ మొత్తం ఖాళీ చేసేసి గోదాములను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.’’ అని ఎండీ అరుణ్‌బాబు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు.


చర్యల మాటేంటి?

గత జగన్‌ ప్రభుత్వం చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు, గృహనిర్మాణశాఖ అధికారులు కుమ్మక్కై భారీ కుంభకోణాలు, అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాలను నిగ్గు తేలుస్తూ విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి ఇటీవల ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వచ్చా యి. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ఇటీవల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ, తాజాగా నాటి అక్రమాల ఆనవాళ్లు కనబడకుండా చెరిపేసి.. ప్రభుత్వం తీసుకునే చర్యల నుంచి తప్పించుకునేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు గోదాములను ఖాళీ చేయాలని చూడడం చర్చగా మారింది. ఇక, జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ చేసిన స్టాకు చాలావరకు కనిపించడం లేదని నివేదిక పేర్కొంది. సిమెంట్‌ స్టాకుకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించకుండా నిల్వలను పక్కదారి పట్టించారని పేర్కొంది. వాటికి సంబంధించిన రసీదులు, వే బిల్లులు, కూపన్ల స్టాక్‌ ఫైల్స్‌ గోడౌన్ల ఇన్‌చార్జిల దగ్గర లేవని పేర్కొంది.

ఆనవాళ్లు లేకుండా చేసేందుకే!

విజిలెన్స్‌ నివేదికలోని వాస్తవాలపై విచారణ లేకుండా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే ఇప్పుడు హౌసింగ్‌ ఉన్నతాధికారులు గోదాములను ఖాళీ చేయించే ప్రక్రియ కు శ్రీకారంచుట్టారనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


భారతీ సిమెంట్స్‌కు 165 కోట్లు

పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీ సిమెంట్స్‌ నుంచి పరిమితికి మించి ఏకంగా 3,31,528 టన్నుల సిమెంట్‌ కొనుగోలు చేసి.. నాటి ప్రభుత్వ అధినేత జగన్‌ కుటుంబానికి రూ.165 కోట్లు చెల్లించారని నివేదిక తెలిపింది. భారతీ సిమెంట్స్‌ కన్నా ఎక్కువ ప్లాంట్‌ సామర్థ్యం అర్హత ఉన్న అలా్ట్ర టెక్‌, రామ్‌కో, మై హోం, పెన్నా, సాగర్‌, జువారీ కంపెనీలతో పాటు కేసీపీ, జేఎ్‌సడబ్ల్యూ, రెయిన్‌, పరాశక్తి, భవ్య, ఎన్‌సీఎల్‌, శ్రీచక్ర, శ్రీజయ జ్యోతి సిమెంట్‌ కంపెనీలకు మాత్రం తక్కువ కొనుగోళ్లు ఆర్డర్లు ఇచ్చారని తెలిపింది. మొత్తంగా 18 సిమెంట్‌ కంపెనీలకు రూ.1,143.11 కోట్లు చెల్లించారు. ఇలా సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సేకరించిన 22,64,855 టన్నుల సిమెంట్‌ను అన్ని జిల్లాల్లో గోదాముల్లో నిల్వ చేశారు. అదే తరహాలో సేకరించిన స్టీలు, ఇతర మెటీరియల్స్‌ కొనుగోలులో వందల రూ.కోట్లు దోచిపెట్టారు.

ఉన్నతాధికారుల పాత్ర

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలన్నింటిలో అప్పటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల పాత్ర ఉందని, నాటి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని విజిలెన్స్‌ నివేదక స్పష్టం చేసింది. అంతేకాదు, తమ ముందస్తు ప్రణాళికలో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా సెంట్ర ల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని తెరమీదకు తెచ్చారని తెలిపింది. ఈ క్రమంలో 3.51 లక్షల ఆప్షన్‌-3 ఇళ్ల లబ్ధిదారులకు తెలియకుండా లక్షలాది టన్నుల సిమెంట్‌, ఇనుము, ఇతర మెటీరియల్స్‌ను ఒకేసారి కొనుగోలు చేశారని నివేదిక వెల్లడించింది. తద్వారా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు పేర్కొంది. పైగా గత ప్రభుత్వ పెద్దలకు కావలసినవారి సిమెంట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసం ఇంత భారీస్థాయిలో నిధులను దుర్వినియోగం చేశారని తెలిపింది. దీని వెనుక బంధుప్రీతి, రాజకీయ కుట్ర ఉన్నట్లుగా పరిగణించవచ్చని విజిలెన్స్‌ వెల్లడించింది.

Updated Date - Mar 03 , 2026 | 05:06 AM