ఇకపై రోడ్లపై గుంతలు కనిపించవు..
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:29 AM
రోడ్లపై గుంతలకు శాశ్వత పరిష్కారం చూపే యంత్రం నగరానికి వచ్చేసింది.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిమిషాల వ్యవధిలో మరమ్మతులు చేపట్టి రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టనుంది. అదే.. ఇన్ఫ్రారెడ్ రీసైక్లింగ్ పోత్ హోల్ అండ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మెషిన్, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రోడ్ల మరమ్మతుల్లో వేగం, నాణ్యత, ఖర్చు తగ్గింపే లక్ష్యంగా ఈ మెషిన్ కీలక పాత్ర పోషిస్తుంది. నగరాభి వృద్ధి దిశగా ఇదో ముందడుగు.
కార్పొరేషన్/లబ్బీపేట, ఆంధ్రజ్యోతి: రోడ్డుపై గుంతల నుంచి నగరవాసులు విముక్తి పొందనున్నారు. ఎక్కడ గుంత కనపడినా పూడ్చేందుకు ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలో ప్యాచ్ వర్క్ పూర్తిచేసే మొబైల్ డాక్టర్ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత తిరుపతి, గుంటూరుల్లో ప్రారంభించిన ప్రభుత్వం.. రాష్ట్రమంతా విస్తరించి గుంతలు లేని రోడ్లను తీర్చిదిద్దే ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఆ తరువాత మంగళగిరి, విజయవాడల్లో ప్రారంభించనుంది. త్వరలో రాజమండ్రి, ఏలూరు, కాకినాడల్లోనూ ఈ వాహనాలు రానున్నట్టు సమాచారం.
బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు.. నగరంలోని గురునానక్ కాలనీలో ఈ మెషిన్‌ను లాంఛనంగా ప్రారంభించగా గురువారం ప్రధాన రహదారి బందర్ రోడ్డులో ప్రారంభించారు. అంబేడ్కర్ సృతి వనం ఎదురుగా ఉన్న ఈ యంత్రం ద్వారా పెద్దగా ట్రాఫిక్ సమస్య లేకుండా కేవలం గంట వ్యవధిలోనే పూర్తిచేశారు. ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ డాక్టర్ వాహనాన్ని కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1.18 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ యంత్రం నిర్వహణను ఢిల్లీకి చెందిన మెట్లైట్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ సిబ్బందితో పాటు నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణలో నగరంలో ఎక్కడి గుంతలు, ప్యాచ్ వర్కులనైనా దీని ద్వారా మరమ్మతులు చేపడతారు.
యంత్రం పని తీరు ఇలా..
ఈ మొబైల్ యంత్రంలో ఇన్ఫ్రారెడ్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా గుంత ఉన్న ప్రాంతాన్ని ఇన్ఫ్రారెడ్ కిరణాలతో వేడి చేస్తారు. దీంతో పాత బిటు మెన్(ఆస్బాల్) మెత్తగవుతుంది. అవసరమైన మేర కొద్దిపాటి కొత్త మెటీరియల్ కలిపి మిశ్రమాన్ని సమంగా చల్లుతారు. రోలర్, కాంపాక్ట్‌తో ప్యాచ్‌లను బిగిస్తుంది. ఇలా చేయడం వల్ల పాత రోడ్డు, కొత్త ప్యాచ్‌ల మధ్య బలమైన బంధం ఏర్పడి ఎక్కువ కాలం నిలుస్తుంది. వాహనంలో ప్రత్యేకంగా అమర్చిన నాలుగు గ్యాస్ సిలిండర్ల నుంచి వెలువడే గ్యాస్, విద్యుత్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బ్యాటరీతో ఈ మెషిన్ పనిచేస్తుంది. ఈ మెషిన్ ద్వారా బీటీ, సీసీ రోడ్ల మరమ్మతులు చేయవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మెషిన్ నిర్విరామంగా పనిచేస్తుందని, ప్రస్తుతం 9 మంది సిబ్బందితో నిర్ణీత సమయంలో పనిచేస్తున్నామని, అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితుల్లోనూ పనిచేస్తామని సిబ్బంది తెలిపారు.
కార్పొరేషన్‌కు ఖర్చు తగ్గిస్తుంది..
ఈ యంత్రం వినియోగంతో నగర మున్సిపల్ కార్పొరేషన్‌కు ఖర్చులు తగ్గడమే కాకుండా ప్రజలు, వాహన చోదకుల నుంచి ఫిర్యాదులూ తగ్గుతాయి. ప్రమాదకరంగా ఉన్న చోట్ల అత్యవసర మరమ్మతులను వేగంగా చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ యంత్రం వినియోగంతో ప్రమాదాలు తగ్గి, వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్‌కు పునాది
తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి
Read Latest AP News And Telugu News