Share News

నేతన్నకు కూటమి సర్కార్ తీపి కబురు

ABN , Publish Date - Feb 20 , 2026 | 09:31 AM

సార్వత్రిక ఎన్నికల్లో చేనేతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరనుంది. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో నేతన్నపై వరాల జల్లు కురిపించారు.

నేతన్నకు కూటమి సర్కార్ తీపి కబురు

  • ఏడాదికి రూ.25వేల చొప్పున రూ.245 కోట్లు కేటాయింపు

  • 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.150 కోట్లు

సత్తెనపల్లి, ఫిబ్రవరి 18: సార్వత్రిక ఎన్నికల్లో చేనేతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరనుంది. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో నేతన్నపై వరాల జల్లు కురిపించారు. మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 81 వేల మగ్గాలకు రూ.245 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అదే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుతు రూ.150 కోట్లను కేటాయించటంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. అందులో ఏసీఐ సీఐ లంబార్డ్ ఇన్సూరెన్స్ ఆరోగ్య పథకం ద్వారా కార్మికుడు రూ.100 చెల్లిస్తే ఏడాది పాటు రూ.15 వేల వరకు ఆరోగ్య బీమా వర్తించేది... చేనేత కార్మికులకు వృత్తి పరంగా రంగుల వల్ల ఊపిరితిత్తులు, కీళ్ళ నొప్పులు, కంటి చూపు లోపం, టీబీ వంటి వ్యాధుల పాలవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో చేనేత కార్మికుల కుటుంబాల్లో ఎవరైనా ఆనారోగ్యం పాలై ఏ వైద్యశాలల్లోనైనా వైద్యం చేయించుకొని బిల్లు పెడితే రూ.15 వేలు ఇచ్చేవారు. అదే విధంగా గుణకర్ బీమా యోజన పథకంలో రూ.800 ఇన్సూరెన్స్ కల్పించే వారు. ఈ పథకంలో కుటుంబ యజమాని సాధారణ మరణం చెందితే రూ.60 వేలు, ప్రమాదవశాత్తు అయితే రూ.1.50 లక్షలు ఇచ్చే వారు.


నేషనల్ హ్యాండ్ లూమ్స్ డెవలప్‌మెంట్ స్కీమ్ పథకంలో చేనేత కార్మికుడికి నూలు కొనుగోలుకు పది శాతం రాయితీ ఇచ్చే వారు. నేషనల్ క్రెడిట్ డెవలప్‌మెంట్ పథకంలో కార్మికులకు ముద్ర యోజన రుణాల కింద రూ. 50 వేలు బ్యాంక్ రుణాలు ఇచ్చేవారు. అదేవిధంగా మగ్గం నేసే కార్మికులకు వర్క్ షెడ్ కోసం రూ.75 వేలు ఇచ్చేవారు. వీటితో పాటు 2019 ఎన్నికల ముందు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై టీడీపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేతన్నకు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను నిలిపివేసి నేతన్న నేస్తం పేరుతో మగ్గానికి రూ.24 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది.


ఒక్కో హామీని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం నేతన్నకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. గత బడ్జెట్‌లో నేతన్నకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించి అమలు చేసింది. అంతే కాకుండా ముడినూలుపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరించి రీయింబర్స్‌మెంట్ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వర్క్ షెడ్లు, ముద్ర రుణాలు అందజేస్తోంది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో నేతన్న భరోసా పథకానికి రూ.245 కోట్లు నిధులు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా మగ్గం నేసే ప్రతి నేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేలు చొప్పన ఇవ్వనున్నారు. అదే విధంగా ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్లకు పెంచుతూ.. అందుకోసం రూ.150 కోట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ ఏడాది చివరి గ్రహణం.. ఎప్పుడంటే? .. ఆ రోజు ఇలా చేయండి..

మిగులు ప్లాట్లను మింగేస్తారా?

For More AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 09:34 AM