Share News

ఈ ఏడాదిలో చివరి గ్రహణం.. ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలంటే.?

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:20 AM

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ ఈ ఏడాది చివరిలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా పవర్ ఫుల్ అని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు.

ఈ ఏడాదిలో చివరి గ్రహణం.. ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలంటే.?
Lunar Eclipse

ఈ ఏడాది అంటే.. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ ఈ ఏడాది చివరిలో అంటే.. మార్చి 3వ తేదీ (03-03-2026) పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహం ఏర్పడనుంది. ఆ రోజు పౌర్ణమి మంగళవారం పూర్వ ఫాల్గుణి (పుబ్బా నక్షత్రం నందు) సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుందని పండితులు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో సంభవిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు గ్రహణ నియమాలు పాటించాలని వారు సూచించారు. ఆలయాల మూసివేత, గ్రహణ పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు ఆచరించాల్సి ఉందని వారు పేర్కొన్నారు.


భారత్‌లో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుందని.. అందువల్లే దీనిని కేతు గ్రస్తోదయ చంద్రగ్రహణం అని వారు స్పష్టం చేశారు. ఇది సంపూర్ణ గ్రహణమైనప్పటికీ.. భారత్‌లో సాయంత్రం 6:20 గంటలకు.. చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని పండితులు సోదాహరణంగా వివరించారు. దీంతో గ్రహణ నియమాలు తప్పక పాటించాల్సి ఉందని పండితులు తెలిపారు.


గ్రహణం ప్రారంభం..

  • మార్చి 3న మధ్యాహ్నం 3:21 గంటలకు భారత్‌లోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ గ్రహణం ప్రారంభమవుతుంది.

  • గ్రహణ మధ్య కాలం: సాయంత్రం 6:03 గంటలు.

  • గ్రహణ మధ్య సంపూర్ణ కాలం: సాయంత్రం 5:32 గంటలు.

  • గ్రహణ మోక్ష కాలం: సాయంత్రం 6:48 గంటలు.

  • అంటే మొత్తం గ్రహణం ఏర్పడే పూర్తి సమయం: 3:27 గంటలు


ఎవరు చూడకూడదంటే.?

సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12:00 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు ముగించుకోవాలి. గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది.

ఈ గ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల.. ఈ రాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. సింహరాశితో పాటు కుంభ, కర్కాటక, మకర రాశులపైనా ఈ గ్రహణ ప్రభావం చెడు ఫలితాలను చూపే అవకాశం ఉంది. మిగిలిన రాశుల మీద మధ్యస్థ, అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు మరుసటి రోజు గ్రహశాంతులు, జపాలు పాటిస్తే.. గ్రహణ దోషాలు తొలగుతాయి.


నియమాలు.. పరిహారాలు..

గ్రహణానికి ముందు పట్టు స్నానం(తల స్నానం), గ్రహణం తర్వాత విడుపు స్నానం చేయాలి. మరీ ముఖ్యంగా గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆహారం నిల్వ ఉంటే..

నిల్వ ఉన్న ఆహారం ఉంటే.. ఆయా పదార్థాలపై దర్బలను ఉంచడం శ్రేయస్కరం.


పుణ్యకాలం..

గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ కాలంలో చేసే దానధర్మాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఇదే సమయంలో చేసే జప, తపాలకూ విశేషమైన పుణ్యం లభిస్తుంది.

అమ్మవారి ధ్యానం..

గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తి, పుణ్యాలను కలుగజేస్తాయి.


ధానాలు..

చంద్ర గ్రహణ సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయి.

గ్రహణం వీడిన తర్వాత..

గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరుచుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి వేదాశీర్వచనం టికెట్ల కుదింపు

మల్లన్న 13 రోజుల హుండీ ఆదాయం రూ.5.61 కోట్లు

For More Devotional News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 12:02 PM