మిగులు ప్లాట్లను మింగేస్తారా?
ABN , Publish Date - Feb 20 , 2026 | 08:54 AM
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ పాలకపక్షం మరో పన్నాగానికి తెరలేపింది. గుణదలలోని కార్పొరేషన్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల లే అవుట్లోని మిగులు ప్లాట్లను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు తెర వెనుక పావులు కదుపుతోంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ పాలకపక్షం మరో పన్నాగానికి తెరలేపింది. గుణదలలోని కార్పొరేషన్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల లే అవుట్లోని మిగులు ప్లాట్లను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు తెర వెనుక పావులు కదుపుతోంది. బలం ఉంది. కదా.. అని శనివారం జరిగే చిట్ట చివరి కౌన్సిల్ సమావేశంలో దీనిని తెరపైకి తెచ్చి ఏకపక్షంగా ఆమోదించుకునేందుకు తీర్మానం ప్రవేశపెట్టడానికి అస్త్రాలు సిద్ధం చేస్తోంది. కాగా, పాలకపక్ష ప్రయత్నాలను అంతే వేగంగా తిప్పికొట్టేందుకు విపక్షాలు సైతం సిద్దమవుతున్నాయి.
మిగులు ప్లాట్లను మింగేస్తారా?
గుణదలలో కార్పొరేషన్ ఉద్యోగుల లే అవుట్‌పై వైసీపీ కన్ను
ఇప్పటికే అజెండాలో పెట్టిన పాలకపక్షం
బలం ఉంది కదా అని ఆమోదానికి ప్రయత్నాలు
అంతే వేగంగా తిప్పికొట్టేందుకు విపక్షాలు సిద్ధం
రేపు కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా చర్చ
విజయవాడ, ఫిబ్రవరి 20: మూడు దశాబ్దాల కిందట అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పాలకపక్షం కార్పొరేషన్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. గుణదలలో ( ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలో) 57 ఎకరాలు కొనుగోలు చేసింది. భూముల కొనుగోలులో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. లే అవుట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పొరేషన్‌కు ఉద్యోగులు చెల్లించిన రూ.10 కోట్ల నగదు సైతం అలాగే మూలుగుతోంది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకపక్షాలేవీ ఈ ప్లాట్లపై దృష్టిపెట్ట లేదు.
ప్రస్తుత సీఎంవో ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న విజయవాడ మునిసిపల్ కమిషనర్ ఉన్న రోజుల్లో ఉద్యోగుల సొమ్ముకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మునిసిపల్ కమిషనర్‌గా వచ్చిన రవిబాబు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటానికి ఉద్యోగుల సొమ్మును ఉపయోగించారు. దీనిపై ఉద్యోగులు ఆందోళనలు చేశారు. టీడీపీ పాలకపక్షం ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇళ్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్, కేటాయింపు జరిగాయి. కొంతమేర మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ పాలకపక్షం ఈ పాట్లలో మౌలిక సదుపాయాల కల్పనను పూర్తి చేయలేదు.
కాలానుగుణంగా మార్పులు
30 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ఈ లే అవుట్ సమీపంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది. పెద్ద అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్ నిర్మాణాలు జరిగాయి. అయినా.. ఇప్పటికీ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి. పక్కనే ఉన్న రియల్ వెంచర్లలో ప్లాట్లకు, వీఎంసీ లే అవుట్‌లోని ప్లాట్లకు ధరలో వ్యత్యాసం ఏర్పడింది. వెంచర్లలో ప్లాట్లు గజం రూ.30 వేలు ఉండగా, కార్పొరేషన్ లే అవుట్‌లో గజం రూ.20 వేలే ఉంది. మౌలిక సదుపాయాల కల్పన లేమి కారణంగా రూ.10 వేల చొప్పున నష్టపోతున్నారు.
దశాబ్దంన్నర కిందట కార్పొరేషన్ ఉద్యోగుల రూ.10 కోట్ల సొమ్మును ఇతర అవసరాలకు వాడటంతో లే అవుట్లో ఇప్పటికీ బ్యాలెన్స్ పనులు పూర్తి చేయ లేదు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలంటే రూ.25 కోట్లు ఖర్చు అవుతుంది. కార్పొరేషన్ వద్ద అంత డబ్బు లేదు.
మిగులు ప్లాట్లపై వైసీపీ రాజకీయం
కార్పొరేషన్‌లో వైసీపీ పాలకపక్షం వచ్చినప్పటి నుంచి మిగులు ప్లాట్లపై కన్నేసింది. మొత్తం 781 ప్లాట్లు ఉండగా, ఉద్యోగులకు దశలవారీగా 711 ప్లాట్లు కేటాయించారు. ఇంకా 70 ప్లాట్లు మిగిలాయి. వీటిని బయట విక్రయించాలని మొదటి నుంచి వైసీపీ పాలకపక్షం భావించింది. ఈ ప్రయత్నాలపై వామపక్ష నేతలు కౌన్సిల్ బయట పోరాడారు. కౌన్సిల్‌లో టీడీపీ కార్పొరేటర్లు గట్టి పోరాటం చేశారు. ఫలితంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మిగులు ప్లాట్లను కూడా కొత్తగా వచ్చిన ఉద్యోగులకు కేటాయించాలని సూచించారు.
2023లో వైసీపీ పాలకపక్షం మళ్లీ ఈ ప్లాట్లపై కన్నేసింది. మిగిలిన 70 ప్లాట్లలో 37 ప్లాట్లను మౌలిక సదుపాయాలైన వాటర్ ట్యాంక్, సీవరేజీ ట్యాంకు తదితరాల కోసం నిర్మించాలని నిర్ణయించారు. వాస్తవానికి మిగిలిన ప్లాట్లను విక్రయించాలన్న ప్లాన్ ఉంది. దీనిని బహిర్గతపరచకుండా అప్పట్లో తీర్మానం చేశారు. వాస్తవానికి కామన్ సైట్‌ను ముందే వదులుతారు. ఆ కామన్ సైట్‌లో పార్కును ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. మిగులు ప్లాట్లను ఉద్యోగులకు కేటాయించాలన్న డిమాండ్ రావటంతో తెలివిగా.. వైసీపీ పాలకపక్షం ధరను నిర్ణయించాల్సిందిగా నిర్దేశించింది.
వైసీపీ వ్యూహం గురించి తెలియక రాష్ట్ర ప్రభుత్వం ఎంఏయూడికి ప్రతిపాదించగా, గజం రూ.20 వేలు మార్కెట్ విలువ ఉందని నిర్ణయించింది. ఇంకా ప్రభుత్వం నుంచి ధరపై స్పష్టత రాలేదు. దీనిని బట్టి 100 గజాలు రూ.20 లక్షలు అవుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి ప్లాట్లను కొనటానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా లేరు. దీంతో ప్లాట్ల కొనుగోలులో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వం నుంచి కూడా ధర ఎంత నిర్ణయించాలన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ పరిణామాలను సభలో చర్చకు పెట్టి కౌన్సిల్లో ఉన్న తమ బలం ద్వారా మిగులు ప్లాట్ల విక్రయాలపై నిర్ణయం తీసుకునేందుకు వైసీపీ తాజాగా వ్యూహం పన్నింది.
థర్డ్ పార్టీ వ్యక్తులతో సంప్రదింపులు
మిగులు ప్లాట్లను విక్రయించేందుకు వైసీపీ పాలకపక్షం థర్డ్ పార్టీ వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేషన్ దగ్గర డబ్బు లేనందున మిగులు ప్లాట్లను విక్రయించటం ద్వారా వచ్చిన డబ్బుతో మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలన్న సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తెరవెనుక మాత్రం ఈ ప్లాట్లను ఎంపిక చేసుకున్న వారికి విక్రయించి లబ్ధి పొందాలన్నది కుట్రగా తెలుస్తోంది. ఈ కుట్రను రానున్న కౌన్సిల్లో విపక్షాలు ఏ విధంగా అడ్డుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ ఏడాది చివరి గ్రహణం.. ఎప్పుడంటే? .. ఆ రోజు ఇలా చేయండి..
ఐఏఎస్ అధికారి దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు దంపతులు
For More AP News And Telugu News