Share News

నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్‌కు పునాది

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:15 AM

‘నిజాయితీ, పారదర్శక విధానాలపైనే హెరిటేజ్‌ను నిర్మించాం. మా విధానాలు, నాణ్యత చూడండి. మా రైతులతో మేం ఎలా ఉంటున్నామో చూడండి.

నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్‌కు పునాది

  • రైతులకు సకాలంలో చెల్లింపు, నాణ్యత- కొలతల్లో

  • పారదర్శకత, న్యాయమైన ధర...ఈ మూడే మా బలం

  • పాడి రైతులతో మాది మూడు దశాబ్దాల బంధం

  • ఆ సంస్థ మేనేజింగ్‌ ట్రస్టీ, ఎండీ నారా భువనేశ్వరి ట్వీట్‌

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘నిజాయితీ, పారదర్శక విధానాలపైనే హెరిటేజ్‌ను నిర్మించాం. మా విధానాలు, నాణ్యత చూడండి. మా రైతులతో మేం ఎలా ఉంటున్నామో చూడండి. మేం చెప్పింది నిజమని తెలుసుకునేందుకు మీరు స్వయంగా చూసి నిర్ధారించుకోవచ్చు. దీనికోసం మేం మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఇదే హెరిటేజ్‌ వాగ్దానం’ అంటూ ఆ సంస్థ మేనేజింగ్‌ ట్రస్టీ, ఎండీ నారా భువనేశ్వరి వెల్లడించారు. హెరిటేజ్‌ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆమె ఈ అంశంపై ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.‘‘ప్రతి ఇంటికీ ఆరోగ్యకరమైన తాజా పాలు, ఉత్పత్తులతో సంతోషపరచడంతోపాటు ప్రతి పాడి రైతు సాధికారత సాధించేలా చేయడమే హెరిటేజ్‌ సంస్థ లక్ష్యం.

33 ఏళ్లుగా ఇదే మా ప్రస్థానం. రూ.4 కోట్లతో చిన్న సంస్థగా ప్రయాణం ప్రారంభించి, ఈరోజు రూ.4 వేల కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగాం. మా లక్ష్యం పట్ల నిజాయితీగా నిలబడే వాగ్దానమే ఈ సంస్థను నిర్మించింది. దీనికి నాణ్యతలో ఎలాంటి రాజీ లేకపోవడమే పునాది. వినియోగదారుల సంతృప్తి, సంతోషాలు ఈ నమ్మకంతోనే మొదలవుతాయి. పాలతోపాటు పెరుగు, నెయ్యి, పన్నీరు, ఐస్‌క్రీమ్‌.. ఇలా అన్ని ఉత్పత్తుల్లో మేం అంకితభావం చూపిస్తాం. హెరిటేజ్‌లో నాణ్యత అనేది ఒకరోజు కృషి కాదు. ప్రతిరోజూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్రతి ఉత్పత్తికీ 25 నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తాం. పరిశుభ్రత, భద్రత, ప్రమాణాల విషయంలో చట్టపరమైన నిబంధనల కంటే కూడా కఠినమైన పరీక్షలు, విధానాలు మేం పాటిస్తాం. 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.


అత్యున్నత ప్రమాణాలు పాటించిన సురక్షితమైన, పోషక విలువలు కలిగిన తాజా ఉత్పత్తులు మాత్రమే మీ ఇంటికి చేరేలా చూస్తాం. పాడి రైతుల్ని శక్తివంతుల్ని చేయడం కూడా మా బాధ్యత. ప్రస్తుతం హెరిటేజ్‌ తొమ్మిది రాష్ట్రాల్లోని 3 లక్షల మంది పాడి రైతులతో కలిసి పని చేస్తోంది. రైతులకు సకాలంలో చెల్లింపు, నాణ్యత-కొలతల విషయంలో పూర్తి పారదర్శకత, న్యాయమైన ధర... ఈ మూడూ ముఖ్య సూత్రాలపై రైతులతో మా భాగస్వామ్యం మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది. అంతేకాదు.. వెటర్నరీ సర్వీసులు, పశు సంరక్షణ, మంచి దాణా, ఆర్థిక రక్షణ, శిక్షణ, డిజిటల్‌ మద్దతు, పెట్టుబడితో రైతుల పురోగతికి కృషి చేస్తున్నాం. రైతుల అత్యుత్తమ జీవనంతోనే నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయనేది హెరిటేజ్‌ విశ్వాసం. మూడున్నర దశాబ్దాలుగా ఆచరణలో నిలబెట్టుకుంటున్న వాగ్దానమి ది. ఇది తరతరాలకు కొనసాగించే అంకితభావం’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏ-6 ఉదయ్‌పై అంత ప్రేమెందుకో!

అబ్బురం.. నేవీ సంబరం

Updated Date - Feb 20 , 2026 | 08:06 AM