అబ్బురం.. నేవీ సంబరం
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:59 AM
విశాఖ సాగర తీరం బాంబు పేలుళ్లతో మోతెక్కింది..! వాయువేగంతో గగనతలంలో దూసుకెళ్లిన యుద్ధ విమానాలు రణభేరిని తలపించాయి...!
ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్.. తీరంలో విన్యాసాలతో ఆకట్టుకున్న నేవీ
కనువిందు చేసిన హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్
విశాఖపట్నం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): విశాఖ సాగర తీరం బాంబు పేలుళ్లతో మోతెక్కింది..! వాయువేగంతో గగనతలంలో దూసుకెళ్లిన యుద్ధ విమానాలు రణభేరిని తలపించాయి...! వివిధ దేశాల ప్రతినిధులు ధవళ వస్త్రాలతో నిర్వహించిన కవాతు ఆహా అనిపించింది..! భారత నావికాదళం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎ్‌ఫఆర్)లో భాగంగా గురువారం సాయంత్రం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన ఈ సాహస విన్యాసాల ప్రదర్శన అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా... భారత నౌకాదళం అధినేత అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన విన్యాసాలు అరగంట సేపు చూపుతిప్పుకోనివ్వలేదు. మూడు చేతక్ హెలికాప్టర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తూ వేదిక ముందు నుంచి వెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత నేవీ వైమానిక దళం వినియోగిస్తున్న... సీ కింగ్-42 హెలికాప్టర్లు, కమోవ్-29 హెలికాప్టర్లు, కమోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లు, సీ కింగ్ హెలికాప్టర్లు ప్రదర్శన చేశాయి.

మెరైన్ కమెండోల విన్యాసాలు
ప్రత్యేక శిక్షణ పొందిన మెరైన్ కమెండోలు సీ కింగ్ హెలికాప్టర్ల నుంచి తాళ్ల సాయంతో సముద్రంలోకి దిగుతూ చేసిన విన్యాసాలు, హెలికాప్టర్ల ద్వారా చేసిన రెస్క్యూ ఆపరేషన్ సాహో అనిపించాయి. వివిధ దేశాల నేవీ సిబ్బంది నిర్వహించిన సిటీ పరేడ్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, ఇరాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సీషెల్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక తదితరదేశాల నేవీ ప్రతినిధులు కవాతులో పాల్గొన్నారు. కూచిపూడి, అరకు థింసా, తప్పెటగుళ్లు, గరగలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. లేజర్ షో, డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ అద్భుతం అనిపించాయి.

పరస్పర సహకారంతోనే సముద్ర సవాళ్లకు చెక్
‘మిలాన్-2026’ సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్
ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకుంటేనే సముద్రంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలుగుతామని, దీనికి అంతా చేతులు కలపాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నేవీ మిలాన్-2026ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 74 దేశాల నేవీ ప్రతినిధులను ఉద్దేశించి రాజ్‌నాథ్ ప్రసంగించారు. సముద్ర మార్గాల్లో ఇటీవల పైరసీ, టెర్రరిజం, అనధికార చేపల వేట, అక్రమ తరలింపు, సైబర్ నేరాలు, వాతావరణ మార్పులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని ఏ ఒక్క నౌకాదళమూ పరిష్కరించలేదని అన్నారు. ఒకరికొకరు సహకరించుకున్నప్పుడే భద్రత సాధ్యమవుతుందని, భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మిలాన్ దీనికి ఒక వేదికగా నిలుస్తుందన్నారు. భారత్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ది రీజియన్ (సాగర్) విధానం అనుసరిస్తున్నదని, దాన్ని ఇప్పుడు మహాసాగర్‌గా ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. సమావేశంలో నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

2 స్టేడియాలంత పొడవైన రన్‌వే..!
ఫ్లీట్ రివ్యూలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’
భారత నౌకాదళంలో అత్యంత శక్తివంతమైనది, వ్యూహాత్మకమైనదిగా పేరొందిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్. విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని ప్రత్యేకతలను నేవీ అధికారులు గురువారం వివరించారు. ఇదిపూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక. దీని నిర్మాణానికి సుమారు రూ.23 వేల కోట్లు వెచ్చించారు. దీనిపై యుద్ధ విమానాలు తేలికగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా రెండు క్రికెట్ స్టేడియాలు కలిపితే ఎంత ఉంటుందో అంత పొడవైన రన్‌వే ఏర్పాటుచేశారు. దీనిపై ఒకేసారి 32 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరించవచ్చు. సముద్రం మధ్యలోనే ఇంధనం నింపుకొనే ఏర్పాట్లు ఉన్నాయి. మిగ్-29 యుద్ధ విమానాలు ఎంత వేగంతో వెళతాయో అదే వేగంతో వచ్చి దీనిపై ఆగేలా ‘హుక్’ స్టాపర్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు.నౌక బరువు 43 వేల టన్నులు. పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ఏకధాటిగా 7,500 కి.మీ. ప్రయాణిస్తుంది.
కవాతు ఐక్యతకు గుర్తు: గవర్నర్
విశాఖ సాగర తీరాన విదేశీ సాయుధ దళాల కవాతు ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని, ఇదే స్ఫూర్తి కొనసాగాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా గురువారం సాయంత్రం విశాఖలో సాహస విన్యాసాల ప్రదర్శనతోపాటు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. భారత నౌకాదళం విదేశీ నౌకాదళాలతో ఇలాంటి అసాధారణ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలే దేశాల మధ్య స్నేహం, విశ్వాసం, పరస్పర గౌరవం పెంచుతాయన్నారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని, నేవీ అధికారులను అభినందించారు. కాగా, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో 74 భాగస్వామ్య దేశాలు పాల్గొన్నాయని నేవీ ఛీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు నేవీ చరిత్రలో ల్యాండ్ మార్కుగా నిలిచిపోతాయన్నారు.