కోల్డ్ స్టోరేజీల్లో భద్రత ప్రశ్నార్థకం!
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:32 AM
ప్రస్తుతం పంటకు మార్కెట్లో ధర లేదు. రైతులు కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపించటంతో కోల్డ్ స్టోరేజీల యజమానులు నిబంధనలను కాలరాస్తున్నారు.
నిబంధనలు పాటించని యాజమాన్యాలు
అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపం
గతేడాది తొర్రగుంటపాలెం కోల్డ్ స్టోరేజీ ప్రమాదం ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం
ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టి రైతులు నష్టపోకుండా చూడాలి
వేసవి వచ్చేసింది. పంటకు మార్కెట్లో ధర లేదు. కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపించటంతో కోల్డ్ స్టోరేజీల యజమానులు నిబంధనలను కాలరాస్తున్నారు. చేతికొచ్చిన మిర్చి పంటను రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుని రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఆంధ్రజ్యోతి, పెనుగంచిప్రోలు రూరల్: గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో రైతులు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవటంతో అన్నదాతలు పండించిన పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని, ధరలు పెరిగిన తర్వాత విక్రయించుకుంటారు. ఈ క్రమంలో గడిచిన కొన్నేళ్లల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పదుల సంఖ్యలో గోదాములు వెలిశాయి. ఎన్టీఆర్ జిల్లాలోనే 17 గోదాములుండగా.. 80,900 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిల్లో మిర్చి, పసుపు, చింతపండు, బెల్లం, శనగలు, కందులు, పెసలు నిల్వ చేస్తున్నారు.
నిబంధనలు గాలికి..
కోల్ట్ స్టోరేజీల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిల్వ చేసిన సరుకు నాణ్యత దెబ్బతింటోంది. వేసవి కాలంలో గోదాముల్లో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. కొన్ని గోదాముల్లో ఏసీలు సరిగా పని చేయకపోవటంతో పంట నాణ్యత దెబ్బతిని రైతులు విక్రయించుకునే సమయంలో లబోదిబోమంటున్నారు. గోదాముకు, అందులో ఉన్న పంటలకు యజమాని బీమా కల్పించాల్సి ఉన్నా కొందరు దాన్ని పట్టించుకోవడం లేదు. బీమాను సకాలంలో రెన్యువల్ చేయించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు రైతులకు నష్టపరిహారం దక్కటం లేదు.
గతేడాది తొర్రగుంటపాలెం గోదాములో జరిగిన అగ్నిపమ్రాదంలో బీమా రెన్యువల్ చేయకపోవటంతో యాజమాన్యం చేతులేత్తేసింది. రూ.10 కోట్ల మేర పంటలకు నష్టం జరగడంతో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రైతుల పక్షాన నిలిచి పోరాటం చేయటంతో యాజమాన్యం దిగి వచ్చి రైతులు నిల్వ చేసిన సరుకుకు పరిహారం చెల్లించింది. ప్రధానంగా కోల్డ్ స్టోరేజీల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. అందుకు ప్రతి ఏడాది అగ్నిమాపక అధికారులు తనిఖీలు చేసి ధ్రువీకరణ చేయాల్సి ఉన్నా అన్ని చోట్లా నామమాత్రంగానే జరుగుతున్నాయి. గోదాముల్లో నిల్వ చేసే వ్యవసాయ ఉత్పత్తుల వివరాలు, వాటికి కల్పించాల్సిన బీమా వంటి విషయాలను మార్కెటింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా అడుగు బయట పెట్టని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
యాజమాన్యాల నిర్లక్ష్యంతో రైతులకు నష్టాలు
గోదాముల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రతి ఏడాది రైతులు నష్టపోతున్నారు. విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవడం కోసం ఏసీలు ఆపేయడం, ఉండాల్సిన సిబ్బంది లేకపోవటంతో సరైన నిర్వహణ లేక సరుకు నాణ్యత దెబ్బతింటోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిల్వ చేసిన పంటలకు రైతులకు తెలియకుండానే యజమానులు బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. అగ్నిప్రమాదాలు జరగకుండా చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటంతో పెద్ద ప్రమాదాలు జరిగి రైతులు నష్టపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..
నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు