నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:26 AM
టీ20 ప్రపంచ కప్-2026లో సూపర్-8కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. పసికూన నమీబియాపై 102 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్-2026లో సూపర్-8కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. పసికూన నమీబియాపై 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-ఏలో రెండోస్థానంలో నిలిచి సూపర్-8కి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ సెంచరీ చేశాడు. అయితే అతడి ఆట తీరును భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) విమర్శించాడు. నమీబియాతో మ్యాచ్‌లో ఫర్హాన్ సెంచరీ మార్క్‌ను అందుకున్న తీరు తనకు నచ్చలేదని పేర్కొన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. 'ఫర్హాన్(Sahibzada Farhan) శతకం కొట్టాడని నేను ఒప్పుకుంటా. కానీ సింగిల్ తీసి వంద పరుగుల మార్కును అందుకోవడం ఏంటి?. సింగిల్‌కి బదులు కాస్త ధైర్యంగా షాట్ బాది ఉంటే బాగుండేది. నువ్వు సెంచరీ పూర్తి చేసుకుంటే సంతోషంగా ఉంటావా? లేదంటే పాకిస్థాన్ 200 రన్స్ చేయకుండా 199 పరుగుల వద్దే ఆగిపోతే ఆనందంగా ఉంటావా?. చివరి ఓవర్లో సెంచరీ కోసం డిఫెన్సివ్ షాట్ ఆడావు!. నువ్వు సూపర్, అద్భుతం’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు వేశాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన షాదాబ్ ఖాన్.. ఫర్హాన్ కంటే బెటర్ అంటూ పఠాన్ విమర్శించాడు.
నిన్న(బుధవారం) కొలంబో వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్(Pakistan vs Namibia)లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ సెంచరీతో రాణించగా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఫర్హాన్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది శతకంతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్ తీసి ఫర్హాన్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆరో బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. చివరి ఓవర్లలో సెంచరీ కోసం అలా నిదానంగా ఆడటం, సింగిల్స్ తీయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ప్రయోజనం కంటే.. వ్యక్తిగత లాభం ముఖ్యమా? అంటూ పలువురు క్రీడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇర్ఫాన్ పఠాన్ కూడా తనదైన శైలిలో పైవిధంగా సెటైర్లు వేశాడు.
ఇవి కూడా చదవండి:
షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..
సిరాజ్ జెర్సీ ధరించిన అభిషేక్.. ఎందుకంటే...