Share News

అతడి ఆలోచన మారాలి.. అభిషేక్ శర్మపై గావస్కర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 10:16 AM

భారత్ జట్టు విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆలోచన విధానం మారి.. సింగిల్స్ తీయడానికి ప్రయత్నం చేయాలని సూచించాడు.

అతడి ఆలోచన మారాలి.. అభిషేక్ శర్మపై గావస్కర్ కీలక వ్యాఖ్యలు
Abhishek Sharma

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ(Abhishek Sharma) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్‌ అయి.. లీగ్‌ దశను అవమానకర రీతిలో ముగించాడు. గ్రూప్‌-ఎలో భాగంగా యూఎస్ఏ మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ (Abhishek Sharma).. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ డకౌట్‌ అయ్యాడు. తాజాగా నిన్న(బుధవారం) నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఓ స్పోర్ట్స్‌ ఛానల్ కు సంబంధించిన షోలో గావస్కర్( Sunil Gavaskar comments) మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ ముందుగా ఒత్తిడి నుంచి బయటపడాలి. విధ్వంసకర ప్లేయర్‌ను అనే తనకున్న ట్యాగ్‌ను మరచిపోయి స్వేచ్ఛగా ఆడినప్పుడే అనుకున్న ఫలితం రాబట్టగలడు. తొందరపడకుండా తెలివిగా షాట్లు ఆడాలి. అయితే అంచనాల భారం అతడిపై ఒత్తిడిని పెంచుతోంది అనుకుంటున్నాను. సిక్స్‌ హిట్టర్‌ అని పేరున్న అభిషేక్‌ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అతడు. ఆ ట్యాగ్ అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తుందేమో!. కారణం ఏదైనప్పటికీ అభిషేక్‌ కాస్త ఓపికగా ఉండాలి' అని తెలిపాడు.


'మొదటి బంతి నుంచే బౌండరీ, సిక్సర్‌ బాదాలని అనుకోవడం సరికాదు. ముందు సింగిల్స్ తీస్తూ తెలివిగా ఆడాలి. ముఖ్యంగా తన కాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవాలి. లేదంటే అతడి షాట్‌ సెలక్షన్‌ను ఎవరైనా ముందే పసిగట్టగలరు. 200కు పైగా స్ట్రైక్‌ రేటుతో బ్యాటింగ్‌ చేసే ప్లేయర్‌గానే తనను చూస్తారన్న ఆలోచన నుంచి అభిషేక్ బయటకు రావాలి. నీ సహజశైలిలో ఆడు.. అప్పుడు తప్పక భారీ స్కోరు సాధించగలవు" అని సునీల్‌ గావస్కర్‌ అభిషేక్‌ శర్మకు కీలక సూచనలు చేశాడు.


ఇవి కూడా చదవండి:

షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..

సిరాజ్ జెర్సీ ధరించిన అభిషేక్.. ఎందుకంటే...

Updated Date - Feb 19 , 2026 | 12:19 PM