షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..
ABN , Publish Date - Feb 19 , 2026 | 07:44 AM
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్) డకౌట్లైన అభిషేక్.. హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: 'అభిషేక్ శర్మ'.. ఈ పేరు వింటే ప్రత్యర్థి జట్లకు వణుకుపుట్టేది. అతడికి ఎలా బౌలింగ్ చేయాలి, ఎలాంటి బంతులు సంధించాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకునేవారు. ఇలా అందరినీ షేక్ చేసే అభిషేక్ శర్మ.. ఇటీవల అతను షేక్ అవుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో శర్మ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, పాకిస్తాన్) డకౌట్లు కాగా.. నిన్న (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.
టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టాప్ ప్లేయర్ ఐసీసీ మెగా టోర్నీలో ఆశించిన మేర రాణించడం లేదు. తన తొలి టీ20 ప్రపంచకప్ లో మూడు మ్యాచ్ లు ఆడినా అభిషేక్ ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అంతేకాక చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఇది ఐదో డకౌట్ కావడం మరింత దారుణం. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో జెర్సీ మార్పు కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు.
అభిషేక్ తన రెగ్యులర్ జెర్సీ కాకుండా సిరాజ్ వేసుకునే 73వ నంబర్ జెర్సీ ధరించి బరిలోకి దిగినా పరుగుల ఖాతాను ఓపెన్ చేయలేదు. తాజా డకౌట్ తర్వాత అభిషేక్.. సంజూ శాంసన్ పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి