Share News

67 ఏళ్లలో తొలిసారి..

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:43 AM

జమ్మూ కశ్మీర్‌ జట్టు 67 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండుసార్లు చాంపియన్‌ బెంగాల్‌ను సెమీఫైనల్లో ఆరు వికెట్లతో చిత్తుచేసింది. చివరిగా 2013-14 సీజన్‌లో...

67 ఏళ్లలో  తొలిసారి..

రంజీ ఫైనల్‌కు జమ్మూకశ్మీర్‌

బెంగాల్‌కు ఝలక్‌

కల్యాణి (పశ్చిమ బెంగాల్‌): జమ్మూ కశ్మీర్‌ జట్టు 67 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండుసార్లు చాంపియన్‌ బెంగాల్‌ను సెమీఫైనల్లో ఆరు వికెట్లతో చిత్తుచేసింది. చివరిగా 2013-14 సీజన్‌లో అత్యుత్తమంగా నాకౌట్‌కు చేరిన ఆ జట్టు.. ఆ తర్వాత అంతకుమించిన స్థాయి ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. 126 పరుగుల ఛేదనలో భాగంగా ఓవర్‌నైట్‌ స్కోరు 42/3తో నాలుగో రోజైన బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జమ్మూ 34.4 ఓవర్లలోనే 126/4 స్కోరు చేసి చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఆకాశ్‌ దీప్‌ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 328, జమ్మూ 302 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 99 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా 9 వికెట్లు తీసిన అకీబ్‌ నబీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక, పాతికేళ్లుగా రంజీల్లో ఆడుతున్న జమ్మూ కెప్టెన్‌, 41 ఏళ్ల పరాస్‌ డోగ్రా.. రంజీల్లో వేగంగా (147 ఇన్నింగ్స్‌) 10వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడయ్యాడు. ఈ క్రమంలో వసీం జాఫర్‌ (196 ఇన్నింగ్స్‌) రికార్డును అధిగమించాడు. ఇక.. ఈ 25 ఏళ్లలో 3 జట్ల తరపున ఆడిన డోగ్రా తొలిసారి రంజీ ఫైనల్‌ బరిలో దిగుతున్నాడు.

కర్ణాటక 299/6: రంజీ ట్రోఫీ మరో సెమీ్‌సలో ఉత్తరాఖండ్‌పై కర్ణాటక భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 149/5తో నాలుగోరోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ 233 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన కర్ణాటక.. స్మరణ్‌ (127) సెంచరీకి తోడు కేఎల్‌ రాహుల్‌ (70 నాటౌట్‌), కృతిక్‌ (52) అర్ధ శతకాలతో సత్తాచాటడంతో ఆట ముగిసేసరికి 299/6 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 736 పరుగులు చేసిన కర్ణాటక.. ఓవరాల్‌గా 802 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు ఆఖరిరోజు కావడంతో కర్ణాటకకు ఫైనల్‌ బెర్త్‌ లాంఛనమే కానుంది. మ్యాచ్‌ డ్రాగా ముగిసినా, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కర్ణాటక ఫైనల్‌ చేరుతుంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్‌: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

Updated Date - Feb 19 , 2026 | 03:43 AM