అభిషేకా.. సంజూనా?
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:26 AM
డిఫెండింగ్ చాంప్ భారత్.. టీ20 వరల్డ్‌కప్ సూపర్-8కు సులువుగానే చేరుకొంది. ఇకపై మాత్రం పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ హ్యాట్రిక్ డక్‌లు జట్టును...
సూపర్-8 ఓపెనర్‌పై డైలమా
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంప్ భారత్.. టీ20 వరల్డ్‌కప్ సూపర్-8కు సులువుగానే చేరుకొంది. ఇకపై మాత్రం పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ హ్యాట్రిక్ డక్‌లు జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. టోర్నీకి ముందు పరుగుల వరద పారించిన అభిషేక్.. వరల్డ్‌క్‌పలో ఖాతా కూడా తెరవకపోవడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన శర్మ.. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతడి బలహీనతను పసిగట్టిన ప్రత్యర్థులు.. తొలి ఓవర్‌లోనే శర్మను బోల్తా కొట్టిస్తున్నారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్ ఆర్యన్ బౌలింగ్‌లో అభిషేక్ బౌల్డ్ అయ్యాడు. బంతిని ఏమాత్రం గమనించక పోవడం, తగిన ఫుట్‌వర్క్ లేకపోవడం వల్లే అతడు వరుసగా విఫలమవుతున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ అంచనాల ఒత్తిడి కూడా శర్మ ఆటపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. ఆరంభంలోనే షాట్ ఆడే బదులు సింగిల్ తీస్తే మేలని గవాస్కర్ సూచించినా.. అతడు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కీలక సూపర్-8 మ్యాచ్‌ల్లో అభిషేక్‌ను జట్టులో కొనసాగించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా దించాలన్న డిమాండ్ క్రమంగా ఊపందుకొంటోంది. మరోవైపు శాంసన్ కూడా గొప్ప ప్రదర్శనేమీ చేయడం లేదు. అభిషేక్ అనారోగ్యానికి గురికావడంతో.. నమీబియాతో మ్యాచ్‌లో చాన్స్ దక్కించుకొన్న అతడు పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఇలా ఓపెనర్లు విఫలమవుతుండడంతో పవర్‌ప్లేలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాతి రౌండ్ మ్యాచ్‌ల్లో ఇదే రిపీటైతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు కూడా..! కానీ, అభిషేక్‌కు మాజీ స్పిన్నర్ అశ్విన్ అండగా నిలిచాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే శర్మ లాంటి వాడిపై వేటేయడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని అన్నాడు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం