సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:42 AM
ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026ని ప్రారంభించారు. ఏఐ సాయంతో సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు పిలుపునిచ్చారు. ‘‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’’ అన్నదే...
టెక్ నిపుణులకు ప్రధాని మోదీ పిలుపు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో ప్రారంభం
స్టాల్ నిర్వాహకులతో ముఖాముఖి
ఫ్రాన్స్, బ్రెజిల్ అధ్యక్షులు వచ్చే అవకాశం
ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026ని ప్రారంభించారు. ఏఐ సాయంతో సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు పిలుపునిచ్చారు. ‘‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’’ అన్నదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026 థీమ్ అని ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేసిన సందేశంలో ప్రధాని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపార రంగాల్లో సంపూర్ణ పరివర్తనకు ఏఐ దోహదపడుతున్నట్టు తెలిపారు. ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన తర్వాత మోదీ ఎక్స్‌పోలో కలియతిరుగుతూ పలువురు స్టాల్ నిర్వాహకులతో సంభాషించారు. సోమవారం ప్రారంభమైన ఈ ఎక్స్‌పో 4రోజుల పాటు జరుగుతుంది. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎక్స్‌పో ఏర్పాటయింది. ప్రపంచ టెక్నాలజీ సంస్థలు, స్టార్ట్‌పలు, విద్య, పరిశోధన సంస్థలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ భాగస్వాములు ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల్లో సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్‌మన్(ఓపెన్ ఏఐ), డరియో అమోదీ(ఆంత్రోపిక్) ఉన్నారు. వారి సెషన్లు బుధవారం నుంచి ప్రారంభం కావచ్చునంటున్నారు. చివరి రెండు రోజుల్లో 20కి పైగా దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఎక్స్‌పోకు హాజరు కానున్న దేశాధినేతల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియా లులా డ సిల్వా ఉన్నారు. ప్రపంచ భవిష్యత్తుకు ఏఐ అనే అంశంపై వారంతా తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు.
త్వరలో ‘‘క్రియేట్ ఇన్ ఇండియా’’ మిషన్
పరిశ్రమ సామర్థ్యాల పెంపు, ఉపాధి కల్పన, భవిష్యత్ సంసిద్ధత గల ప్రతిభావంతుల తయారీ లక్ష్యంగా త్వరలో క్రియేట్ ఇన్ ఇండియా పేరిట ఒక కార్యక్రమం ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. తమ ప్రస్తుత సామర్థ్యాలను పటిష్ఠం చేయడంతో పాటు ప్రపంచానికి ప్రాధాన్యతా వేదికగా భారత్ మారేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. ఇన్నోవేషన్‌కు ఏఐ ముప్పు అన్న వాదాన్ని ఆయన తోసిపుచ్చారు. కొత్త టెక్నాలజీని స్వీకరించడం అంటే చేపను నీటిలోకి తీసుకెళ్లడం అని ఆయన అన్నారు.
ఏఐ వినియోగంతో తస్మాత్ జాగ్రత
ఏఐ పరికరాల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద హెచ్చరించారు. ఏఐ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెంది, ప్రజాస్తామ్య వ్యవస్థలు బలహీనపడే ముప్పు ఉన్నదన్నారు. ఏఐ వినియోగం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల అధ్యయన సామర్థ్యాలు విశేషంగా పెరిగినా విమర్శనాత్మకమైన ఆలోచనలు, ఉత్సుకతలు నీరుగారిపోకుండా చూసుకోవలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. కృత్రిమ మేధ రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు అజయ్ కుమార్ సూద్ అన్నారు. బాలల వికాసంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
సినిమా దిశను మార్చుతోంది: రానా
ఏఐ సినిమా ప్రపంచ దిశను మార్చుతోందని నటుడు రాణా దగ్గుబాటి అన్నారు. సినిమాపై అనిశ్చితిని తొలగించి సృజనాత్మక నిర్ణయాలకు ఏఐ పదును పెడుతుందన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ చిత్రీకరణకు గతంలో 3-5 రోజుల వ్యవధి పట్టేదని, ఏఐ సహాయంతో ఇప్పుడు 2-3 గంటల వ్యవధిలోనే వాటిని చిత్రీకరించగలుగుతున్నారని చెప్పారు. వాస్తవానికి ప్రస్తుత ఏఐ ప్రపంచంలో చిత్ర నిర్మాత షూటింగ్ ప్రారంభం కావడం కన్నా ముందే తన సినిమాను వీక్షించగలుగుతున్నట్టు రానా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..