ఎల్‌నినో ప్రభావం ఎండుతున్న తోటలు!
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:23 AM
రాష్ట్రంలోని పండ్ల తోటలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవన వర్షాలు కురవక, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి నీటి తడులు అందించడం కష్టంగా మారుతోంది. పొడి వాతావరణం కారణంగా తోటలు ఎండుముఖం పడుతున్నాయి.
సీమలో ఉద్యాన పంటలపై ప్రభావం
ఇలాగే ఉంటే.. అడుగంటనున్న భూగర్భ జలాలు
రైతులు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి
తోటల సంరక్షణపై ఉద్యాన శాఖ సూచనలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పండ్ల తోటలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవన వర్షాలు కురవక, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి నీటి తడులు అందించడం కష్టంగా మారుతోంది. పొడి వాతావరణం కారణంగా తోటలు ఎండుముఖం పడుతున్నాయి. ఎల్‌నినో కారణంగా జూన్, జూలైల్లో వర్షపాతం గణనీయంగా తగ్గింది. రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగితే.. భూగర్భ జలాలు మరింత అడుగంటే అవకాశాలున్నాయి. దీనివల్ల బోర్ల ద్వారా నీటి తడులు అందించడం కూడా కష్టమవుతుంది. ఫలితంగా పండ్ల తోటలు ఎండిపోవడం, ఉత్పత్తి పడిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రాయలసీమలో అరటి, బత్తాయి, నిమ్మ, నారింజ, దానిమ్మ, మిర్చి, టమాటా, ఉల్లి పంటలు సాగులో ఉన్నాయి. నీటి వసతి లేని ప్రాంతాల్లోని ఉద్యాన రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన వేడి, గరిష్ఠ ఉష్ణోగ్రతల వల్ల పండ్ల మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడుతోంది. పండ్లు రాలిపోవడం, నాణ్యత తగ్గడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నిమ్మ, నారింజపై తీవ్ర ప్రభావం
రాయలసీమ 10 జిల్లాల్లోని 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలోని ఉద్యాన పంటలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు అంచనా వేశారు. కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, మార్కాపురం జిల్లాల్లో తీపి నారింజ, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నిమ్మ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టమాటా, పల్నాడు, కర్నూలు, మార్కాపురం జిల్లాల్లో మిర్చి పంటలు ‘హైరి్‌స్క’లో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్యాటగిరీలోని నారింజ, నిమ్మ తోటలను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులకు నీటి యాజమాన్యం, తోటల సంరక్షణపై సూచనలు ఇస్తున్నారు. మిర్చి, టమాటా, ఉల్లి సాగును బోర్ల కిందే చేసుకోవాలని సూచిస్తున్నారు. వెద పద్ధతిలో విత్తనాలు నాటుకోవాలని, రైతులు పంటల బీమాలో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పండ్ల తోటలు దెబ్బతినకుండా రైతులకు సూచనలు ఇస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు. ఉద్యాన పంటలకు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎల్‌నినో కారణంగా ఉద్యాన పంటలపై తేమ, వేడిగాలుల ఒత్తిడి, నీటి ఎద్దడి, తెగుళ్లు ప్రభావం చూపుతాయని చెప్పారు. పండ్ల తోటలకు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల బీమాలో నిమ్మ, నారింజ రైతులను నమోదు చేస్తున్నామని చెప్పారు. మల్చింగ్, వీడ్ మ్యాట్‌ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
సబ్సిడీలు ఇలా..
వర్షపు నీటిని నిల్వ చేసేలా పంట కుంటను వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటే 50 శాతం సబ్సిడీ కింద రూ.90 వేలు, సామూహిక నిర్మాణాలకు రూ.24 లక్షల వరకు లభించనుంది.
తోటలకు వేడి తగలకుండా తేమ అందేలా చెట్ల పాదులను ఆకులతో నింపే ప్రక్రియకు చదరపు మీటరుకు రూ.25 సబ్సిడీ లభించనుంది.
ఇవీ సూచనలు
డ్రిప్ ఇరిగేషన్‌తో 40-50 శాతం నీటిని ఆదా చేయొచ్చు. పండ్ల తోటల్లో పూత, ఫలదీకరణ దశల్లో నీరు అందించాలి. గొట్టపు బావులపై ఆటోమేటిక్ స్టార్టర్ల వాడకాన్ని నిలిపివేయాలి. ఆటోమేటెడ్ డ్రిప్ విధానానికి మారాలి.
మొక్కలు వడబడకుండా చల్లని సమయాల్లో తరచూ నీటిని అందించాలి. తోటల్లో నీటి తేమ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. చెట్ల మొదళ్లకు సున్నం రాయాలి. వేడి గాలులు తగలకుండా చిన్న మొక్కలకు షేడ్‌నెట్లు వాడాలి.
నిమ్మ, తీపి నారింజ, తోటలకు రోజుకు, ఒక్కో మొక్కకు 80-100 లీటర్లు, మామిడికి 30-40 లీటర్లు, సపోటాకు 25-40 లీటర్లు, దానిమ్మకు 20-35 లీటర్లు, బొప్పాయికి 25 లీటర్లు, అరటికి 8-12 లీటర్లు, జామకు 20-30, జీడిమామిడికి 20 లీటర్ల నీటిని మొక్క స్థితిని బట్టి అందించాలి.
పండ్లు పగలిపోకుండా, తొక్కను స్థిరత్వం చేసే కాల్షియం వాడాలి. పండ్లకు కవర్లు తొడగాలి. చెట్లకు గాలి నిరోధక ఊతకర్రలు పాతాలి.
ఎండ వేడిని తట్టుకునేలా పొటాషియం వేయాలి. నత్రజని ఎరువులు తగ్గించాలి. అధిక వేడి సమయాల్లో యూరియా వాడకూడదు.
వేడి, పొడి వాతావరణాల్లో రసం పీల్చే పురుగులు వ్యాప్తి చెందుతాయి. వారానికోసారి తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాలి. తెగుళ్ల నిర్మూలనకు కొమ్మలపై పసుపు, నీలి రంగు ఉచ్చులు వేలాడదీయాలి. తోట మొత్తం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి.