CM Chandrababu: దేశంలో జాతీయ భావన పెరగాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:48 PM
దేశంలో అనేక భాషలు ఉన్నా.. ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగ పడతాయని వివరించారు.
గుంటూరు జిల్లా, జనవరి 5(ఆంధ్రజ్యోతి): దేశంలో జాతీయ భావన పెరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. మాతృభాష అమ్మతో సమానమని పేర్కొన్నారు. మాతృ భాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరని చెప్పుకొచ్చారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్‌కు అభినందనలు తెలిపారు. ఇవాళ(సోమవారం) గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు.
సంక్రాంతి కంటే ముందు వచ్చిన అమ్మభాష పండుగ ఇదని తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు ఈ వేదికకు పెట్టారని ప్రశంసించారు. దేశంలో అనేక భాషలు ఉన్నా.. ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉందని వెల్లడించారు. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయని వివరించారు. తెలుగు రచనలు అంటే నన్నయ్య మహాభారతం, అష్టదిగ్గజాలని తెలిపారు. గురజాడ వంటి అనేక రచయితలు... పద్య రచయితల రచనలు మనం ఎన్నటికీ మరచిపోవలేమని పేర్కొన్నారు. అనమయ్య, రామదాసు, మొల్ల, వెంగమాంబ వంటివారు భక్తి మార్గంలో తెలుగుకు వన్నె తెచ్చారని కీర్తించారు.
గ్రాంథిక భాష నుంచి వచన భాషగా మార్చిన వారిని మనం మరచిపోలేమని తెలిపారు. నేను తెలుగు వాడిని నాది తెలుగు భాష అని చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు రావాలని పోరాడిన వ్యక్తి మహనీయుడు పొట్టి శ్రీరాములును మరవలేమని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలని పోరాడిన బూర్గుల రామకృష్ణారావు త్యాగం మరవలేమని చెప్పుకొచ్చారు. వారసులుగా భాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. మన ప్రాస, యాస, సందులు, సమాసాలు చాలా ప్రత్యేకమైనవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నవారు, ప్రతిభ చూపినవారికి.. పూర్ణకుంభ వంటి అవార్డులు ఇచ్చారని తెలిపారు. 1949లో హైదరాబాద్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్‌గా ఎదిగిందని అన్నారు. 2017లో ఆంధ్ర సారస్వత పరిషత్‌కు మళ్లీ ఊపిరిపోశారని వివరించారు. మాతృభాష మన మూలాలకు సంకేతమని తెలిపారు. టెక్నాలజీతో భాష కనుమరుగవుతుందని అన్నారని.. కానీ టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News