నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ పర్యాటకానికి పెద్దపీట
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:55 PM
నీతి ఆయోగ్ 'దివ్య భారత్' నివేదికలో ఏపీ పర్యాటకానికి పెద్దపీట వేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందేనని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు నీతి ఆయోగ్ సూచించింది.
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్ 'దివ్య భారత్' నివేదికలో ఏపీ పర్యాటకానికి (AP Tourism) పెద్దపీట వేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందేనని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు నీతి ఆయోగ్ సూచించింది. ఏపీని ఒక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వానికి నీతిఆయోగ్ నివేదిక ఒక మైలురాయిగా నిలవనుంది. 13 పేజీల సమగ్ర నివేదికతో పాటు, 1:20 నిమిషాల నిడివి గల ప్రత్యేక వీడియో ద్వారా ఏపీ పర్యాటక గమ్యస్థానాలను ప్రపంచానికి నీతి ఆయోగ్ పరిచయం చేసింది. భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని ఆకాంక్షించే సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌లకు ఈ నివేదిక మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఏపీలో ఏ నెలలో ఎక్కడికి వెళ్తే బాగుంటుందో వివరించింది. ఏపీని సందర్శించేందుకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అత్యంత అనువైన సమయమని నీతి ఆయోగ్ సూచించింది. రాష్ట్రంలోని ప్రకృతి ప్రాంతాలు, ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు, పురాతన కోటలు, సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలు, విశాల సముద్రతీరం, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రఖ్యాతి గాంచిన స్థానిక వంటకాలు, సంప్రదాయ వస్త్రాలు, హస్త కళాకృతులు, బౌద్ధారామాలు, పర్యాటక ఉత్సవాలు, ఘనమైన వారసత్వం తదితర విశేషాలను నీతి ఆయోగ్ తన జాబితాలో వెల్లడించింది.
కూచిపూడి, విలాసిని నాట్యాల వంటి సంప్రదాయ కళలకు ఏపీ కేంద్రమని, ఇక్కడి ఆత్మీయ ఆతిథ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందని నీతి ఆయోగ్ తన జాబితాలో అభివర్ణించింది. ప్రకృతి ఒడిలో అరకు వ్యాలీ, లంబసింగి, మారేడుమిల్లి, పాపికొండలు, కురుపాం అటవీ ప్రాంతాలు, నల్లమల్ల అడవులు, హార్సిలీ హిల్స్, కొల్లేరు, పులికాట్ సరస్సు, కోనసీమలకు చోటు దక్కింది. కొత్తపల్లి, రంప, తలకోన, ఎత్తిపోతల జలపాతాలు, కంభం చెరువు, కోనం, తాటిపూడి రిజర్వాయర్లకు నీతి ఆయోగ్ జాబితాలో స్థానం లభించింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో తప్పనిసరిగా చూడాల్సిన వాటిలో కంబాలకొండ, కోరింగ మడ అడవులు, నేలపట్టు, ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. చారిత్రక యాత్రగా బొర్రా గుహలు, బెలూం గుహలు, ఉండవల్లి, మొగల్రాజపురం, ఉదయగిరి గుహలు చూడాలని వెల్లడించింది. గండికోట (గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా), కొండపల్లి కోట, చంద్రగిరి, గుత్తి కోటలు తప్పక సందర్శించాలని సూచించింది. రుషికొండ, సూర్యలంక, కొత్తపట్నం బీచ్‌లు, ఎర్రమట్టి దిబ్బలు, ఇటీవల గిన్నీస్ రికార్డుల్లోకెక్కిన 5 శతాబ్దాల నాటి తిమ్మమ్మ మర్రిమాను, కాకినాడ హోప్ ఐల్యాండ్‌కు స్థానం లభించింది. తిరుమల వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విశాఖపట్నం అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయం, పాలకొల్లు క్షీరారామ క్షేత్రం, మహానంది, యాగంటి, పరిటాల ఆంజనేయ స్వామి, రామతీర్థం ఆలయాలకు జాబితాలో చోటు దక్కింది.
అమరావతి మహాచైత్య, బావికొండ బౌద్ధ స్మారకాలు, కడప పెద్ద దర్గా, నెల్లూరు బారా షాహిద్ దర్గా, గుంటూరు జేఎం బాప్టిస్ట్ చర్చి, చేబ్రోలు చర్చిలు ఈ జాబితాలో ఉన్నాయి. రాజమహేంద్రవరం రైల్వే వంతెన, కోనసీమలోని దిండి, విజయవాడ కృష్ణానది, తిరుపతిలోని వేంకటేశ్వర నేషనల్ పార్క్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి, శ్రీముఖ లింగాలు తప్పక సందర్శించాల్సిన ప్రాంతాలుగా నీతి ఆయోగ్ వెల్లడించింది. ఆంధ్రా వంటకాలుగా పులిహోర, పూతరేకులు, కాజా, పెసరట్టు, గోంగూర పచ్చడి, ఉలవచారు, బొబ్బట్లు, రాగి సంగటి, ఆంధ్రా చికెన్ కర్రీ, చేపల పులుసు, బొబ్బట్లు, గుత్తి వంకాయ, అరిసెలకు ఈ జాబితాలో చోటు దక్కింది. తిరుమల బ్రహ్మోత్సవాలు, లేపాక్షి, విశాఖపట్నం, లుంబిని ఉత్సవాలు, కోనసీమ సంక్రాంతి సంబరాలు, రాయలసీమ ఆహారం, నృత్య ఉత్సవాలు, సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ , దక్షిణ హస్త కళా మేళాకు నీతి ఆయోగ్ ఈ జాబితాలో చోటు కల్పించింది. వస్త్రాల జాబితాలో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ జామ్దానీ, కలంకారీ చీరలు ఉన్నాయి. హస్తకళాకృతుల్లో ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, నరసాపురం లేస్, శ్రీకాకుళం జిల్లాలోని బుడితి మెటల్ క్రాఫ్ట్‌లకు స్థానం కల్పించింది. ఆత్మీయ పలకరింపునకు ఏపీ చిరునామా అని నీతి ఆయోగ్ తన జాబితాలో పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News