Share News

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:26 PM

ల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎన్‌ఆర్‌ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్
AP Minister Kondapalli Srinivas

అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎన్‌ఆర్‌ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (AP Minister Kondapalli Srinivas) వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని కోరారు.


తెలుగు వారి క్షేమం కోసం చర్యలు..

ఇవాళ(సోమవారం) అమరావతి వేదికగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయిల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి క్షేమం కోసం నిరంతరం తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.


వారి వసతి, భద్రతపై చర్యలు..

ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాల్లోని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, తాము ఎప్పటికప్పుడూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్నార్టీ) ద్వారా ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సహాయం చేసేందుకు గానూ చర్యలు చేపడుతున్నామని వివరించారు. గల్ఫ్ దేశాల్లోని ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి, స్థానికంగా ఉన్న తెలుగు కుటుంబాల సహకారం తీసుకోవాలని సూచించారు. వారి ద్వారా తాత్కాలిక వసతి, భద్రత, అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.


కో ఆర్డినేటర్లతో సంప్రదింపులు..

ఏపీ ఎన్నార్టీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూ, కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ వివరాలను ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ 0863 - 2340678, వాట్సాప్: +91 85000 27678 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. వీటితోపాటు ఈమెయిల్: helpline@apnrts.comలకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే సంప్రదించి సహాయం పొందాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.


క్లోజ్ మానిటరింగ్..

గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజల భద్రతపై ఏపీ ప్రభుత్వం క్లోజ్ మానిటరింగ్ చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితులు మానిటరింగ్ చేస్తున్నామని వివరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో (Andhra Pradesh Bhavan) ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (Andhra Pradesh Non Resident Telugu Society) ద్వారా ప్రతి దేశంలో తెలుగు కోఆర్డినేటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.


ఆరుగురికి వసతి..

24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ వ్యవస్థ ప్రారంభించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు: ఏపీ భవన్: 9871999430, ఏపీ ఎన్ఆర్టీ: 0863-2340678లో సంప్రదించాలని సూచించారు. బెహరిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కున్న ఆరుగురికి వసతి కల్పించామని అన్నారు. దుబాయ్‌లో పదిమంది తెలుగు వారికి తక్షణ సహాయం అందించామని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు, హోటళ్లు, ఫుడ్ సపోర్ట్ ద్వారా సేఫ్ జోన్లలో ఉంచేలా చర్యలు చేపట్టామని వివరించారు. గల్ఫ్ వెళ్లిన సుమారు లక్షమంది తెలుగువారి డేటా తమ దగ్గర ఉందని తెలిపారు. మరో ఐదు లక్షల మందికి పైగా తెలుగువారు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 01:34 PM