AP Liquor Sales:ఫుల్లుగా తాగేశారు.. రికార్డ్ సృష్టించిన మందుబాబులు
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:07 PM
న్యూఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం మందుబాబులు అరుదైన రికార్డు సృష్టించారు. డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
అమరావతి, జనవరి1 (ఆంధ్రజ్యోతి): న్యూఇయర్ వేడుకల (New Year Celebrations) సందర్భంగా నిన్న(బుధవారం) మందుబాబులు అరుదైన రికార్డు సృష్టించారు. డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు (AP Liquor Sales) గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజులో రూ.172 కోట్ల విలువ కలిగిన మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఈ విక్రయాల్లో 2,20,719 కేసుల మద్యం, 95,026 కేసుల బీరు విక్రయించినట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.60 కోట్లమేర ఎక్కువగా మద్యం తాగారు లిక్కర్ ప్రియులు.
గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రూ.112 కోట్ల విలువ కలిగిన మద్యం మాత్రమే విక్రయించారు. 2024 డిసెంబర్ 31లో 1,26,128 మద్యం కేసులు, 68,754 బీర్ కేసులు మాత్రమే అమ్మకమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 31న అమ్మకాలు గత సంవత్సరం కంటే గణనీయంగా పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం మద్యం వినియోగం పెరుగుదల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో గణనీయమైన ఆదాయం లభించిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మద్యపాన ప్రియుల వినియోగం, ప్రత్యేకంగా హాలీడే సీజన్, కొత్త సంవత్సర వేడుకలు, పార్టీలు వంటి సందర్భాల్లో పెరుగుతునట్లు అంచనా వేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, మార్కెట్లలో మద్యం వినియోగం సాధారణ కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.
ఇవాళ (జనవరి 1)వ తేదీన కూడా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత ఏడాదితో సరిపోల్చినప్పుడు ఈ ఏడాది ప్రారంభంలో కూడా మద్యం, బీరు అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. మద్యపాన సరఫరా, మార్కెట్ డిమాండ్, వినియోగదారుల సంఖ్య, వేడుకల సీజన్ వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఈ రకమైన రికార్డు అమ్మకాలు, ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం అందించిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, మద్యపానంపై నియంత్రణలు, వయస్సు పరిమితులు, లైసెన్సింగ్ వంటి నియమాలను కూడా ఏపీ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News