Pawan Kalyan: సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:37 PM
ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో ‘అమరజీవి జలధారలు’ కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా రైతులకు స్థిరమైన ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు.
అమరావతి, జనవరి1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ప్రజలకు అమోదయోగ్యమైన సంస్కరణలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి సర్కార్ పరిపాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.
పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రెట్టింపు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, హరిత కార్యక్రమాలు, తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో ‘అమరజీవి జలధారలు’ కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దీని ద్వారా రైతులకు స్థిరమైన ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు.
మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా ‘అడవి తల్లి బాట’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు రహదారులు, మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
వన్యప్రాణి సంరక్షణలో భాగంగా ‘హనుమాన్ ప్రాజెక్టు’ ద్వారా అడవులు, జంతు సంపద రక్షణకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ముఖ్యంగా ఏనుగుల బెడదను నియంత్రించేందుకు కుంకీలు, ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మానవ – వన్యప్రాణి సంఘర్షణకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా తమ పాలన కొనసాగుతోందని తెలిపారు. పరిపాలనా సంస్కరణలతో పాటు సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమతుల్యత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. 2025లో పవన్ కల్యాణ్‌కు కేటాయించిన శాఖలపై తనదైన ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కల్యాణ్ కార్యాచరణతో ఏపీ అన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలన రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
Read Latest AP News And Telugu News